Wednesday, November 20, 2024

PD ACT: రాజాసింగ్‌కు బెయిల్ దొరకడం కష్టమేనా?.. పీడీ యాక్ట్ వ‌ల్ల ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిందేనా?

హైద‌రాబాద్‌లోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈమేర‌కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వివ‌రాలు వెల్లడించారు. అయితే తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవ్వడం ఇదే ఫ‌స్ట్ టైమ్ అని తెలుస్తోంది. రాజాసింగ్‌పై ఎక్కువ సంఖ్య‌లో క్రిమినల్ కేసులున్నాయని, రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, ఇవ్వాల (గురువారం) రాజాసింగ్‌ను ఆయన ఆఫీసు వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు.. పీడీ యాక్ట్‌కు సంబంధించిన నోటీసులు అందించినట్టుగా తెలుస్తోంది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

అయితే.. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో రాజాసింగ్‌ను బీజేపీ పార్టీ బ‌హిష్క‌రించింది. ఆయ‌న‌కు పార్టీలోని అన్ని ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక‌.. రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. తరుచూ నేరాలకు పాల్పడేవారికి, పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు పీడీ యాక్ట్‌ను అమలు చేస్తారు. నేరస్థులు సమాజానికి ముప్పుగా పరిణమిస్తున్నారనే కారణంతో ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు. కాగా, పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సంబంధించిన వివరాలను.. పీడీ యాక్ట్ బోర్డు ముందు సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పీడీ యాక్ట్ బోర్డు భేటీ జరుగుతుంది. ఆ బోర్డు.. పీడీ యాక్ట్‌‌ను నిర్దారిస్తే ఏడాది పాటు జైలులో ఉండే అవకాశం ఉంటుందని స‌మాచారం. మరోవైపు ఈ పీడీ యాక్ట్‌ను సవాలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక‌.. 2004 నుంచి ఇప్పటిదాకా రాజాసింగ్‌పై 101కి పైగా క్రిమినల్ కేసులు నమోదయిన‌ట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాజాసింగ్‌పై 18 కమ్యూనల్ కేసులున్నాయని స‌మాచారం. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో గతంలోనే రౌడీషీట్ ఉంది. పాత కేసుల ఆధారంగా అత‌నిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే.. రాజాసింగ్ తరుచూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, మత ఘర్షణలు చోటుచేసుకునేలా ఆ ప్రసంగాలు ఉంటున్నాయ‌ని పోలీసులు అంటున్నారు.

ఇక‌.. ఈ నెల 22వ తేదీన‌ రాజాసింగ్ రెచ్చగొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తూ ఓ యూట్యూబ్ చానల్‌‌లో వీడియో పోస్టు చేశారని హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఓ వర్గాన్ని కించపరిచేలా ఆ వీడియో ఉంద‌న్నారు. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించిందన్నారు. ఈ నెల 23న రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని, అయినా మరోసారి వీడియోలు విడుదల చేస్తానని రాజాసింగ్ మీడియాకు ప్రకటించారని చెప్పారు. మత విద్వేషాల ప్రసంగాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగిందన్నారు. వీడియో కారణంగానే నిరసనలు, ఉద్రిక్తతలు చోటుచేసుకన్నాయని చెప్పారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారని అన్నారు. కాగా, రాజా సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఆయనను తొలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. రాజా సింగ్ అరెస్టు నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement