Thursday, September 19, 2024

ఒడ‌వ‌ని ముచ్చ‌ట‌: పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుతో కాంగ్రెస్‌ గట్టెక్కేనా? సునీల్‌ ముందు సవాలక్ష సవాళ్లు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో వరుస ఓటములను చవి చూస్తున్న హస్తం పార్టీకి 2023లో జరిగే ఎన్నికలు ఏ మేరకు కలిసి వస్తాయనే చర్చ మొదలైంది. ఇక రాజకీయ వ్యూహకర్తల విషయంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్‌ కిషోర్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి పని చేస్తారని ప్రచారం జరిగినప్పుడు.. టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విమర్శలకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి పీకేలు అవసరం లేదని, కాంగ్రెస్‌లోని ప్రతి కార్యకర్త పీకేలేనని ప్రకటించుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ను గట్టెక్కించేందుకు రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పని చేస్తారని, ఆయన్ను ప్రయివేట్‌ వ్యక్తిగా కాకుండా పార్టీ వర్కర్‌గానే చూడాలని సీనియర్లతో జరిగిన సమావేశంలో స్వయంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీనే ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహాకర్తలు అవసరం లేదని కొంత మంది నాయకులు చెప్పినప్పటికి.. రాహుల్‌గాంధీ ఆదేశాలను తప్పకపాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి..

ఈ వ్యూహాకర్తలు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కిస్తారా..? అనేది చర్చగా మారింది. కాంగ్రెస్‌ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలమైన కేడర్‌ ఉన్నప్పటికి.. నాయకుల మధ్య నెలకొన్న విభేదాలే కొంప ముంచుతాయని అంటున్నారు. రాహుల్‌గాంధీతో జరిగిన భేటీలో నాయకులందరే కలిసి పని చేయాలని సూచించగా.. తామందరం కలిసి చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికి నాయకుల మధ్యలో నెలకొన్న మనస్ఫర్దలు దూరం కాలేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి చెందిన 38 మంది సీనియర్లతో ఒకేసారి సమావేశం కావడంతో పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను పూర్తిగా వివరించలేకపోయాని, ఒక్కొక్కరిని పిలిచి ముఖాముఖిగా మాట్లాడితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీన్ని బట్టి చూస్తే పైకి మాత్రమే ఐక్యంగా ఉంటామని ప్రకటించినప్పటికి అంతర్గతంగా ఉన్న విభేదాలు మాత్రం పూర్తిగా సమిసిపోలేదని తెలుస్తోంది. టీ పీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాల స్పీడ్‌ పెంచారు. దళిత, గిరిజన దండోరా, మన ఊరు- మనపోరు సభలు నిర్వహించడమే కాకుండా వరి ధాన్యం, ఇతర ప్రజా సమస్యలపైన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేడర్‌ను అప్రమత్తం చేస్తున్నప్పటికి సభల్లో సీనియర్లకు అవమానాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
30 నియోజక వర్గాలకుపైగా నాయకత్వ లేమి..

ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీజేపీ కూడా బలపడుతోంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజా సమస్యలతో పాటు పార్టీ కార్యక్రమాల స్పీడ్‌ను పెంచుకుని ముందుకెళ్లుతున్నారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉంది. అయితే రాష్ట్రంలోని 119 అసెంబ్లిd నియోజక వర్గాలకు గాను.. దాదాపుగా 30 నుంచి 40 అసెంబ్లిd నియోజక వర్గాల్లో నాయకత్వలేమి కనిపిస్తోంది. 2018 ఎన్నికల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా హస్తానికి దూరమయ్యారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఒక్కో నియోజక వర్గంలో ఇద్దరు లేదా ముగ్గురు నాయకులు ఎవరికి వారుగా నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లుగా ప్రకటించుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందురు సీనియర్ల అండదండలు తనకే ఉన్నాయని, పార్టీ టికెట్‌ విషయంలో హామీ ఇచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కింది స్థాయిలోనూ విభేదాలున్నాయని విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో రాజకీయ వ్యూహకర్తకు ఒక సవాల్‌గానే ఉంటుందనే అభిప్రాయం సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. తెలంగాణ ఇచ్చామని ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నప్పటికి ప్రజలు విశ్వసించలేదని, ఇప్పుడు ప్రచార రూట్‌ మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement