కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు కేంద్రం ప్రభుత్వం పద్మవిభూష్ అవార్డు ప్రకటించడంపై ఆపార్టీ నేత జైరామ్ రమేశ్ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. ఆయనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. దేశం ఆయన సేవలను గుర్తిస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి మాత్రం గులాంనబీ ఆజాద్ సేవలు అవసరం లేనట్టుందని అన్నారు. ‘‘గులాంనబీ ఆజాద్ కు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అభినందనలు భాయిజాన్. ప్రజా జీవితంలో ఆయన సేవలను దేశం గుర్తిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గులామ్ నబీ ఆజాద్ సేవలు అవసరం లేకపోవడం విడ్డూరంగా ఉంది’’అని పేర్కొన్నారు.
కాగా, ప్రజా జీవితంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం తెలిసిందే. మంగళవారం రాత్రి పద్మ అవార్డుల ప్రకటన వెలువడింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ దీన్ని సమర్థిస్తూ చేసిన ట్వీట్ వివాదానికి దారితీసింది. బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటనను జైరామ్ రమేశ్ ట్వీట్ చేస్తూ.. ‘ఇది సరైన పని. ఆయన అజాద్ గా ఉండాలనుకుంటున్నారు. గులామ్ లా కాదు’అంటూ వెటకారంగా ట్వీట్ చేశారు.