Thursday, November 21, 2024

Final Battle | తొలి క్వాలిఫయర్ నేడు.. ఫైనల్లో అడుగు పెట్టేదెవరో?

  • కోల్‌కతాతో హైదరాబాద్‌ కీలక పోరు
  • గెలిస్తే నేరుగా ఫైనల్‌కు అర్హత
  • రాత్రి 7:30 గంటలకు

రెండు నెలలుగా క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్న ఐపీఎల్‌-17 నాకౌట్‌ దశకు చేరుకుంది. క్వాలిఫయర్‌-1లో భాగంగా ఇవ్వాల‌ (మంగళవారం) అహ్మదాబాద్‌ వేదికగా టేబుల్‌ టాపర్‌ కోల్‌కతా.. రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ జ‌ట్లు పోటీప‌డ‌తాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. మరో మ్యాచ్‌ (క్వాలిఫయర్‌ 2) ఆలోచన లేకుండా ఇరు జట్లూ అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. సీజన్‌ ఆసాంతం నిలకడగా రాణిస్తూ సమిష్టి ప్రదర్శనలతో ప్లేఆఫ్స్‌ చేరిన ఈ రెండు జట్లలో మ్యాచ్‌ విన్నర్లకు కొదవలేకపోవడంతో మోతేరా స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది.

ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్‌ జోడీ అయిన ఫిల్‌ సాల్ట్‌-సునీల్‌ నరైన్‌ బాదుడుకు బలికాని ప్రత్యర్థి లేరంటే అతిశయోక్తి లేదు. కానీ ప్లేఆఫ్స్‌లో కేకేఆర్‌కు సాల్ట్‌ లేకపోవడం ఎదురుదెబ్బే. జాతీయ జట్టు (ఇంగ్లండ్‌) బాధ్యతల నిమిత్తం అతడు కోల్‌కతాను వీడాడు.ఈ నేపథ్యంలో కేకేఆర్‌ టాప్‌ స్కోరర్‌ నరైన్‌ (461) పై మరోసారి భారీ ఆశలే పెట్టుకుంది. అతడిని త్వరగా ఔట్‌ చేస్తే మిడిలార్డర్‌ కూడా తడబడుతోంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నా అతడూ ప్రమాదకారే. వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా నిలకడకు తోడు ఆఖర్లో ఆండ్రీ రస్సెల్‌ మెరుపులు మెరిపిస్తే హైదరాబాద్‌కు తిప్పలు తప్పవు. ఆడేది తక్కువ బంతులే అయినా రమణ్‌దీప్‌ సింగ్‌ భారీ హిట్టింగ్‌లతో కీలక పరుగులు రాబడుతున్నాడు. కమిన్స్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ బౌలింగ్‌ దళం వీళ్లను ఎలా కట్టడి చేస్తుందన్నది ఆసక్తికరం.

వాళ్లిద్దరి మీదే ఆశలు..

- Advertisement -

హైదరాబాద్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన ట్రావిస్‌ హెడ్‌ (533 పరుగులు), అభిషేక్‌ శర్మ (467) ఎలా ఆడతారన్నదానిపైనే సన్‌రైజర్స్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయాలలో వీరిదే అగ్రతాంబూలం అని చెప్పక తప్పదు. ఈ ఇద్దరూ తొలి 8 ఓవర్ల పాటు క్రీజులో నిలిస్తే స్టార్క్‌ అండ్‌ కో.కు బడిత పూజ తప్పదు. మూడో స్థానంలో రాహుల్‌ త్రిపాఠికి మరోసారి అవకాశం దక్కితే అది జట్టుకు మేలు చేసేదే. వైజాగ్‌ కుర్రాడు నితీశ్‌ రెడ్డి అంచనాలకు మించి రాణిస్తుండటం ఎస్‌ఆర్‌హెచ్‌కు అదనపు బలం. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్లాసెన్‌ ఫామ్‌లోకి రావడం హైదరాబాద్‌కు శుభసూచకమే.

పిచ్ రిపోర్ట్‌..
అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామమే అయినా గత 12 మ్యాచ్‌లలో ఇక్కడ 200+ స్కోర్లు నమోదైంది రెండు సార్లే. రెండో సారి బ్యాటింగ్‌ చేసే జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఫైన‌ల్‌ జట్లు (అంచనా):
కేకేఆర్‌: నరైన్‌, గుర్బాజ్‌, శ్రేయస్‌ (కెప్టెన్‌), వెంకటేశ్‌, నితీశ్‌, రింకూ, రస్సెల్‌, రమణ్‌దీప్‌, స్టార్క్‌, హర్షిత్‌, చక్రవర్తి

ఎస్‌ఆర్‌హెచ్‌: హెడ్‌, అభిషేక్‌, త్రిపాఠి, నితీశ్‌, క్లాసెన్‌, షాబాజ్‌, సమద్‌, సన్వీర్‌, కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌, నటరాజన్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement