ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోవడంతో ఏం చేయాలో తెలియక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు బెట్టింగ్ లు జోరుగా సాగుతుంటాయి. ఈ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు జరుగుతుండడంతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ లు జోరుగా సాగుతున్నాయి. పందాలు కాచి, డబ్బులు పోగొట్టుకొని పలువురు ఇబ్బందులు పడుతున్నారు. అలా ఐపీఎల్ బెట్టింగ్ వేసి.. డబ్బులు పోగొట్టుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో వెలుగు చూసింది. ఈ తండాలో ఉండే అంబోతు ప్రకాష్ (19) అనే యువకుడు ఐపీఎల్ బెట్టింగ్ లో డబ్బులు కాశాడు. బెట్టింగ్ ఓడిపోవడంతో డబ్బులు కోల్పోయి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రకాష్ కొంతమంది మిత్రులతో.. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్ లో పంజాబ్ గెలుస్తుందని బెట్టింగ్ చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోయింది. బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉండడంతో ఏం చేయాలో పాలుపోని ప్రకాష్ మానసికంగా తీవ్రంగా ఒత్తిడికి గురయ్యాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.