ఐపీఎల్-2022 ప్రారంభం ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల 26న ప్రారంభమై మే 29న ఈ మెగా టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నమెంట్‌లో 40శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. గురువారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ తర్వాత ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ఈ సంగతి చెప్పారు. మార్చి 26 (శనివారం) టోర్నమెంట్ ప్రారంభం అవుతుందని తెలిపారు. కొత్త ఫ్రాంచైసీలు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా రోస్టర్‌లోకి వస్తాయన్నారు. టోర్నీ మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయని బ్రిజేష్ పటేల్ చెప్పారు. వాటిలో 70 మ్యాచ్‌లు ముంబై వాంఖడే స్టేడియం, బ్రాబౌర్న్ స్టేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ గ్రౌండ్స్, పుణెలోని గహుంజే స్టేడియంలలో జరుగుతాయి.
వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ గ్రౌండ్స్‌లో 20 చొప్పున, బ్రాబౌర్న్, గహుంజే స్టేడియంలలో 15 చొప్పున మ్యాచ్‌లు జరుగనున్నాయని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసింది. కరోనా మహమ్మారి కేసులు తగ్గితే పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించొచ్చునని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించే విషయమై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి.