మతం ముసుగులో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్న విభజన అంశాల పన్నాగాలను మీడియా, జర్నలిస్టులు బయటపెట్టాలని మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌లో ఇవ్వాల (శనివారం) ‘తెలంగాణలో మీడియా: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అనే అంశంపై జాతీయ సెమినార్ జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో పరిశోధనాత్మక జర్నలిజం కొరవడిందన్నారు. మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ భాగస్వామ్యంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ సదస్సును నిర్వహించింది.
శ్రీలంక ఇంధన శాఖ అధిపతి చేసిన ఆరోపణలను ప్రచురించడానికి, చర్చించడానికి లేదా పరిశీలించడానికి దేశంలోని ఏ మీడియా సంస్థ ధైర్యం చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. అధ్యక్షుడు రాజపక్సేపై ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి ఫలితంగా అదానీకి 6,000 కోట్ల ప్రాజెక్టు కట్టబెట్టారన్న విషయం బహిరంగ రహస్యం అయినప్పుడు దానిపై ఎందుకు ప్రత్యేక కథనాలు రాయలేదని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మన్ కీ బాత్ నిర్వహిస్తున్నారని, ఆ సమయంలో ప్రధాని మీడియాతో నేరుగా మాట్లాడారా? అని ఐటీ మంత్రి ప్రశ్నించారు.
దేశంలో ద్రవ్యోల్బణం.. పెరుగుతున్న రూపాయి సమస్యలకంటే.. హిజాబ్, హలాల్, నాన్-హలాల్ మాంసం వంటి ప్రధాన వార్తా కథనాలకు ఇంపార్టెన్స్ పెరిగిందని కేటీఆర్ అన్నారు. వార్తలు, వాస్తవాలు, అభిప్రాయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు తాను రోజూ 13 వార్తాపత్రికలు చదువుతాను అన్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తనకు రోజూ గంటన్నర సేపు వార్తాపత్రికలు చదవడం అలవాటు చేశారని తెలిపారు.
ఇక.. 3000 మంది మీడియా రిపోర్టర్లకు మాత్రమే అక్రిడిటేషన్ కార్డులు సరఫరా చేసిన గుజరాత్ జర్నలిస్టులతో 19,000 మందికి అక్రిడేషన్ ఇచ్చిన తెలంగాణతో పోల్చడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా భవన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు. దేశంలోనే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, పింఛన్ల కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.