తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వ్యంలో సిట్ నిందితుల్ని లోతుగా విచారిస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు 42 ప్రశ్నలు అడిగారు. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించారు. అయితే రెండోరోజైన ఈరోజు ఉదయం రామచంద్ర భారతి, సింహాయాజి, నందకుమార్ల స్వర నమూనాలను సేకరించారు.
స్వర నమూనా సేకరణ పూర్తయిన తర్వాత రాజేంద్రనగర్ ఏసీబీ కార్యాలయానికి వారిని తరలించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వారి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్కు తరలించి.. అక్కడ ముగ్గురు నిందితుల వాయిస్ రికార్డు చేశారు. బేరసారాల ఆడియో, వీడియోల వాయిస్‌తో అధికారులు వాటిని పోల్చి చూడనున్నారు. కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా కానుంది.