Wednesday, November 20, 2024

lakhimpur kheri: ఇది ఓ అన్ఎండింగ్ స్టోరీలా ఉండిపోతుందా.. యూపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన సుప్రీంకోర్టు

lakhimpur kheri: దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బుధ‌వారం యూపీ ప్ర‌భుత్వం సీల్డ్ క‌వ‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేస్తూ.. ఘ‌ట‌న‌కు సంబంధించి 10 మంది నిందుతుల‌ను అరెస్టు చేసిన‌ట్టు పేర్కొన‌గా.. ఈ కేసులో పోలీసు ఇన్వెస్టిగేష‌న్ అన్ ఎండింగ్ స్టోరీలా మారుతుందా.. అని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. 44 మందిలో న‌లుగురి స్టేట్‌మెంట్ మాత్ర‌మే రికార్డు చేయ‌డంపై బెంచ్ ఈ వ్యాఖ్య‌లు చేసింది.

కాగా, లఖింపూర్‌ ఘటనకు సంబంధించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ నెల 8న సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్​ 3న లఖింపూర్​ ఖేరిలో జిల్లాలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటన నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి.

ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే చ‌నిపోగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయిన వారిలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్‌, ముగ్గురు బీజేపీ కార్యకర్తలున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా పది మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) అరెస్టు చేసింది.

లఖింపూర్​ ఘటనపై సీబీఐతో కూడిన ఉన్నత స్థాయి న్యాయ విచారణను కోరుతూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐకి లేఖ రాసిన తర్వాత సుప్రీం కోర్టు ఈ కేసును విచార‌ణ చేప‌ట్టింది. ఈ నెల 8న కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు ఘటనకు బాధ్యులైన నిందితులను అరెస్టు చేయకపోవడంతో యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యపై దర్యాప్తులో విశ్వాసం కలిగించేందుకు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement