Friday, December 20, 2024

Invention – కేన్సర్‌కు వ్యాక్సిన్ – ఒక్క టీకాతో వ్యాధి మాయం

వ్యాక్సిన్ డెవ‌ల‌ప్ చేసిన‌ రష్యా ప్ర‌భుత్వం
ఈ ఏడాది ప్రారంభంలోనే ప్ర‌క‌టించిన పుతిన్‌
ప‌లు విధాల ప్ర‌యోగ స్థాయిలు దాటుకుని ముందుకు
క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో అద్భంతమైన‌ ప‌నితీరు
కేన్స‌ర్ క‌ణితుల‌ను అడ్డుకున్న వ్యాక్సిన్‌
వాటిని కేన్స‌ర్ ర‌హితంగా మార్చ‌డంలోనూ స‌క్సెస్‌
జ‌బ్బుతో పోరాడే వారిలో వ్యాధి నిరోధ‌క‌శ‌క్తిని పెంచే చాన్స్‌
గ‌ర్భాశ‌య కేన్స‌ర్‌తో స‌హా ప్రాణాంత‌క క‌ణితి క‌ణాల‌కు చెక్‌
ఎంఆర్ఎన్ఏ ఆధారంగా రూపొందిన డ్ర‌గ్‌
ప్ర‌పంచ వ్యాప్తంగా ఫ్రీగా పంపిణీ చేయాలని ర‌ష్యా నిర్ణయం
సంతోషం వ్య‌క్తం చేస్తున్న కేన్స‌ర్ బాధిత కుటుంబాలు
ర‌ష్యా నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న వైద్య నిపుణులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: వైద్య రంగంలో ఇదో మ‌హాద్భుతం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్ప‌టిదాకా కేన్స‌ర్ వ్యాధి నివారించేందుకు పలు రకాల ట్రీట్​మెంట్​ ఉన్నప్పటికీ పూర్తిగా నయం కావడం లేదు. దీంతో కేన్సర్​ సోకితే మరణం ఖాయం అనే భావనలో చాలామంది ఉన్నారు. అయితే.. కేన్స‌ర్ సోకిన‌ప్పుడు చాలా ర‌కాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన జీన్ సీక్వెన్సింగ్ ద్వారా అందించే చికిత్స మంచి ఫ‌లితాలనే ఇస్తోంది. కొన్నాళ్లుగా రేడియేష‌న్ చికిత్స కూడా పురోగ‌తి సాధిస్తోంది. శ‌రీరంలోని కేన్స‌ర్ క‌ణాల‌ను టార్గెట్ చేసి రేడియేష‌న్ కేన్స‌ర్ క‌ణాల‌ను స‌మూలంగా తుడిచి పెట్టేస్తోంది. కేన్స‌ర్ సోకిన శ‌రీరాన్ని బ‌ట్టి డాక్ట‌ర్లు ఈ చికిత్స విధానాల‌ను ఎంచుకుంటారు. అయితే.. రష్యా ప్రభుత్వం చాలాకాలంగా కేన్సర్​ను అంతం చేయడానికి వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు పలు రకాలుగా ప్రయోగాలు చేపట్టింది. ఇందులో అనేక పరిశోధనా సంస్థలు కలిసి సమష్టిగా ఒక వ్యాక్సిన్​ను డెవలప్​ చేశాయి. దీన్ని వచ్చే ఏడాది జనవరిలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్​ ప్రకటించారు.

mRNA ఆధారంగా రూపొందిన వ్యాక్సిన్​..

ప్రాణాంతక కేన్సర్ వ్యాధిపై రష్యా పైచేయి సాధించింది. కేన్స‌ర్‌ను అంత‌మొందించేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ దేశం వివ‌రాల‌ను వెళ్ల‌డించింది. మరో విషయం ఏంటంటే.. ఈ వ్యాక్సిన్ల‌ను ఉచితంగా పంపిణీ చేస్తామని ర‌ష్యా తెలియ‌జేసింది. కేన్సర్ కేసులు ఇప్పుడు అన్ని దేశాల్లో నమోదవుతున్నాయి. కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తేనే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు రష్యా కేన్సర్ కోసం ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డంతో బాధిత కుటుంబాల్లో సంతోషం వ్య‌క్తం అవుతోంది. mRNA ఆధారితంగా రూపొందించిన వ్యాక్సిన్ కేన్సర్‌తో పోరాడుతుందని రష్యా చెబుతోంది.

2025 జనవరిలో అందుబాటులోకి..

- Advertisement -

రష్యా అభివృద్ధి చేసిన mRNA ఆధారిత కేన్సర్ వ్యాక్సిన్ 2025 ప్రారంభంలో విడుదల కానుంది. కేన్సర్ వ్యాక్సిన్ విడుదలైన వెంటనే రష్యన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. రష్యాలోని రేడియల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. వ్యాక్సిన్ ప్రయోగాత్మక దశలో కేన్సర్ కణితుల పెరుగుదలను నియంత్రించిందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ కేన్సర్‌తో బాధపడుతున్న రోగులలో కణితులను నియంత్రించడంలో, వాటిని కేన్సర్ రహితంగా మార్చడంలో సహాయపడిందని గామాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్‌లోని ఎపిడెమియాలజీ, మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్జ్‌బర్గ్ తెలిపారు.

కేన్సర్​ కణాలను సమూలంగా అడ్డుకుంటోంది..

అనేక పరిశోధన సంస్థలు సమష్టి కృషితో కేన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. క్లీనికల్ ట్రయల్స్‌లో కణతి పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్ అంటే వ్యాధికారక ఏజెంట్‌ను నిరోధించిందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ రోగికి కేన్సర్‌తో పోరాడే యాంటీబాడీని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇది కేన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కేన్సర్ కణాలతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ద్వారా, ఇది కణితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. గర్భాశయ కేన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక, ప్రమాదకరమైన కణితి కణాలకు వ్యతిరేకంగా కూడా ఈ టీకా ప్రభావవంతంగా ఉంటుందని రష్యా వైద్య నిపుణులు చెబుతున్నారు.

వైద్యరంగంలోనే మైలురాయి..

వైద్యరంగంలో కేన్సర్ వ్యాక్సిన్ అనేది ఒక ప్రధాన మైలురాయి కానుంది. అనేక దేశాలు కేన్సర్‌తో పోరాడటానికి టీకాలు, మందులను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే.. అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రష్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంటుంద‌ని అక్క‌డి వైద్య నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

2024 ప్రారంభంలోనే ప్రకటించిన పుతిన్​..

ఈ ఏడాది ప్రారంభంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశారు. కేన్సర్‌తో పోరాడే వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసిందన్నారు. వ్యాక్సిన్ ప్రయోగాత్మక దశలో మంచి ఫలితాలను చూపిందన్నారు. అయితే.. వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో దాదాపు విజయం సాధించామని తెలిపారు. కాగా, ఇప్పుడు కేన్సర్ వ్యాక్సిన్ ప్ర‌యోగాలు చివ‌రి ద‌శ‌లో ఉండ‌డం.. కేన్స‌ర్ క‌ణితుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిరోధించ‌డంతో యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌న్నీ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement