కరోనా వేరియంట్ థర్డ్ వేవ్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ అవుతోంది.. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. కాగా, ఫిబ్రవరి 15 నాటికి పీక్ స్టేజీకి చేరుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు రాబోయే రోజుల్లో మూడో వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ మున్ముందు తీవ్రతరం కానున్నట్టు తెలుస్తోంది. రోజువారీ కొవిడ్ పాజిటివ్ కేసులు ఎప్పుడైనా గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ప్రఖ్యాత సూత్ర కన్సార్టియం పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. డెల్టా సెకండ్ వేవ్‌తో పోల్చినప్పుడు మూడో వేవ్ సమయంలో ఆసుపత్రిలో చేరే బాధితుల సంఖ్య తక్కువగా ఉంటుందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
“డెల్టాతో పోల్చినప్పుడు ఒమిక్రాన్ తీవ్రత చాలా తక్కువ అని, కొత్త వేరియంట్ కారణంగా తెలంగాణలో రోజువారీ కేసులు పెరుగుతాయని చెబుతున్నారు వైద్య పరిశోధకులు. వారం లేదా పదిరోజులు వరకు ఆ కేసులు ఉంటాయని, ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పీక్ స్టేజీకి వెళ్తాయని ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విద్యాసాగర్ మీడియాతో చెప్పారు. పెద్దలతో పోలిస్తే పిల్లలతో ప్రభావం తక్కువేనని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలను స్కూళ్లకు పంపించవచ్చని అంటున్నారు. ఒకవేళ పిల్లలకు జలుబు, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే.. ఆ తీవ్రత తగ్గిన తర్వాత సందేహపడకుండా బడికి పంపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
కాగా, తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 97,549 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,944 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,372 పాజిటివ్ కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 288, రంగారెడ్డి జిల్లాలో 259, ఖమ్మం జిల్లాలో 135, సంగారెడ్డి జిల్లాలో 120, హనుమకొండ జిల్లాలో 117, నిజామాబాద్ జిల్లాలో 105, సిద్దిపేట జిల్లాలో 104, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 101 కేసులు గుర్తించారు.