ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక,శారీరక ప్రశాంతతకు,ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం.. ప్రపంచానికి యోగాను అందించిన భారతదేశం… ప్రతి సంవత్సం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
అయితే, ప్రతి యోగా డేకు ఒక నినాదాన్ని నిర్ణయించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది యోగా ఫర్ వెల్‌నెస్ అనే నినాదాన్ని యోగా డే నినాదంగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘ఇవాళ మనం 7వ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈసారి యోగా డే నినాదం యోగా ఫర్ వెల్‌నెస్. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా సాధన చేయాలనేది ఈ నినాదం ఉద్దేశం’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ యోగా దినోత్సవం నాడు యోగా ఫర్ వెల్‌నెస్ థీమ్ తెచ్చామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… ప్రజలంతా యోగా చెయ్యాలని కోరారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కరోనా రోజుల్లో యోగాసనాలు చేయడం ద్వారా… అనారోగ్యాలు చాలా వరకూ తగ్గుతాయని అన్న ఆయన… డాక్టర్లు కూడా యోగా ద్వారా జబ్బులను నయం చేయడానికి ప్రయత్నించాలని కోరారు.