పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ఇంఛార్జ్ పొత్తూరు రామరాజు, మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సమక్షంలోనే టీడీపీ నేతలు వాగ్వాదం, తోపులాటకు దిగారు.
టీడీపీ అధిష్టానం ఐదు నెలల క్రితం నరసాపురం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మాధవనాయుడును తప్పించి రామరాజును నియమించింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. రెండు గ్రూపులు పార్టీ కార్యక్రమాలు కూడా వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. శ్రేణుల మధ్య విభేదాలు తొలగించేందుకు టీడీపీ నేతలు సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రయత్నిస్తున్నారు. అందుకే మాధవనాయుడు నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.. అనంతరం ముగ్గురు కలిసి పార్టీ సమావేశానికి వెళ్లారు.
పార్టీ కార్యక్రమాలు సజావుగా జరగలేదని పార్టీ సమావేశంలో మాధవనాయుడుని ఉద్దేశించి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ భూపతి నరేష్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై మాధవ మాధవ నాయుడు వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వేదికపైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. అడ్డుకునేందుకు యత్నించిన రామరాజు వర్గీయులతో వాగ్వాదం, బాహాబాహికి దిగారు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ గొడవ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ సమక్షంలో జరిగింది. తర్వాత పార్టీ పెద్దలు మందలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాగా, రెండు వర్గాలు గొడవకు దిగడంతో టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. విభేదాలు తొలగించేందుకు టీడీపీ జిల్లా నేతలు ప్రయత్నిస్తుంటే.. స్థానిక నేతలు ఇలా బాహా బాహీకి దిగడం గమనార్హం.