Saturday, November 23, 2024

Political Survey: ఇండియా టుడే-సీ ఓట‌ర్ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు.. అధికారంలోకి వ‌చ్చేది ఎవ‌రంటే!

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు మ‌రో రెండేళ్ల‌దాకా స‌మ‌యం ఉంది. కానీ, ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు, పార్టీల బ‌లా బ‌లాలు, ప్ర‌జ‌ల నాడీ వంటి అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి ఓ సర్వే నిర్వ‌హించింది. దీనిలో ప‌లు ఆసక్తికర అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఏపీలో అత్యధిక శాతం ప్రజలు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీకే మద్దతుగా నిలుస్తారని ఈ సర్వేలో తేలింది.

అయితే, 2019 కంటే ఈసారి కొన్ని సీట్లు తగ్గుతాయని ఆ స‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది. కిందటిసారి వైసీపీ ఏపీలో 22 ఎంపీ స్థానాలు నెగ్గగా, 2024లో 18 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. వైసీపీ ఖాతాలోని ఆ నాలుగు స్థానాలు కాస్త టీడీపీ కైవసం చేసుకుంటుందని స‌ర్వే పేర్కొంది. అదే సమయంలో వైసీపీకి 127 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని, మునుపటి కంటే ఈసారి త‌క్కువ మెజారిటీ వ‌స్తుంద‌ని ఆస‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది.

ఇక.. తెలంగాణ విషయానికొస్తే.. 2024 ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర స‌మితికి ఎదురు ఉండ‌ద‌ని ప్ర‌జ‌ల నాడీ వెల్ల‌డి చేస్తోంది. కానీ, బీజేపీ కాస్త పుంజుకోనున్న‌ట్టు ఇండియాటుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు ఉండగా.. వచ్చే ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలిచే చాన్స్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, అధికార టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్ కు 3 ఎంపీ స్థానాలు లభించవచ్చని స‌ర్వే రిపోర్టు చెబుతోంది.

కేంద్రంలో పరిస్థితులపై కూడా ఈ స‌ర్వే దృష్టి సారించింది. దేశంలో ధ‌ర‌ల మోత‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నా.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ నేత‌లు లేక‌పోవ‌డంతో తిరిగి మోదీ నాయకత్వం వైపే మొగ్గు క‌నిపిస్తోంద‌ని.. కానీ, 2019లో వచ్చిన సీట్లు ఈసారి బీజేపీకి రాబోవ‌ని సీ వోట‌ర్ స‌ర్వే పేర్కొంది. గత ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు చేజిక్కించుకోగా, ఈసారి 286 సీట్ల కంటే త‌క్కువే వచ్చే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.

అయితే, కాంగ్రెస్ బలం మరింత పెరిగే చాన్స్ ఉంద‌ని, గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, 2024 ఎన్నికల్లో 146 వరకు సీట్ల దాకా గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇండియాటుడే-సీ ఓటర్ సర్వే వివరించింది. కానీ, రాహుల్ గాంధీ లీడ‌ర్‌షిప్‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేద‌ని, అందుకే అత‌డిని ప్రధానిగా 9 శాతం మందే కోరుకున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement