Wednesday, November 20, 2024

వడ్డీరేట్లు యథాతథం.. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

న్యూఢిల్లి: వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ గురువారం కీలక ప్రకటన చేసింది. దైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడించారు. కరోనా ముప్పు, ద్రవ్యోల్బణం తదితర కారణాలతో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటు 4శాతం, రివర్స్‌ రెపోరేటు 3.35శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు దాస్‌ తెలిపారు. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది పదోసారి కావడం గమనార్హం. మూడు రోజుల సమీక్ష అనంతరం ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను దాస్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. ద్రవోల్బణం పెరిగిన నేపథ్యంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ పాలసీ నిర్ణయాన్ని కమిటీ సభ్యులందరూ ఆమోదించినట్లు వెల్లడించారు.

2020 మే 22న శక్తికాంత దాస్‌ నేతృత్వంలో ఎంపీసీ చివరిసారిగా వడ్డీరేట్లులో మార్పులు చేసింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం రెపోరేటును 4శాతానికి కుదిస్తూ ఆర్బీఐ నిర్ణయించి అప్పటినుంచి అలాగే కొనసాగిస్తోంది. 2022-23 బడ్జెట్‌ తరాత నిర్వహించిన తొలి ఎంపీసీ సమావేశంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలనే నిర్ణయం తీసకున్నారు. అయితే ఈ సమావేశంలో వృద్ధిరేటు అంచనాలను ఆర్బీఐ స్వల్పంగా సవరించింది. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.8శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. అదేవిధంగా ద్రవ్యోల్బణం 2021-22 ఏడాదికి 5.3శాతం, 2022-23ఏడాదికి 4.5శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 460పాయింట్లు వృద్ధి చెందగా నిఫ్టీ 142పాయింట్లు ఎగబాకింది.

రెపో, రివర్స్‌ రెపో రేట్లు అంటే..
బ్యాంక్‌లు తమ అవసరాలకు రిజర్వు బ్యాంక్‌ నుంచి తీసుకునే రుణంపై చెల్లించే వడ్డినే రెపో రేటు అంటారు. బ్యాంకుల వద్ద ద్రవ్యం తక్కువగా ఉన్న సమయంలో బ్యాంక్‌లు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి. అదేవిధంగా బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉన్న నగదును రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జమ చేస్తుంటాయి. బ్యాంకులు తమవద్ద ఉంచిన మొత్తానికి ఆర్బీఐ ఆయా బ్యాంక్‌లకు చెల్లించే వడ్డీ రేటునే రివర్స్‌ రెపో రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం చెలామణి పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువైనా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement