Telangana Inter Exams: రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం (అక్టోబర్ 25) నుంచి నవంబర్ 2వ తేదీ (మంగళవారం) వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు కరోనా నిబంధనలు అనుసరిస్తూ ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా 2020-21 విద్యాసంవత్సరం విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది ప్రభుత్వం. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం స్టూడెంట్స్ కు మార్కులను పెంచి మెమోలు ఇచ్చింది. అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కు మాత్రం పరీక్షలను నిర్వహించలేదు.
తాజాగా కరోనా కొంచెం తగ్గుముఖం పట్టడంతో పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈసారి కొత్తగా మొబైల్ యాప్ ను వినియోగంలోకి తీసుకుని రానున్నారు. ఓఎంఆర్ షీట్‌లో మాల్‌ప్రాక్టీస్, బ్లాంక్ బార్ కోడ్, ఆబ్సెంట్, డ్యామేజ్, బార్‌కోడ్, ఎయిడెడ్ క్యాండిడేట్స్ వంటి సేవలను యాప్ అందించనుంది.
ఇక బెంచీకి ఒకరు చొప్పున మాత్రమే కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. నిమిషయం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతి ఇవ్వమన్నారు. పరీక్ష నిర్వహించనున్న కేంద్రాల్లో అధికారులు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం పై దృష్టి సారించారు. ఇప్పటికే పరీక్ష నిర్వహించే కాలేజీలను శానిటేషన్ చేశారు. ఇక కరోనా వైరస్ నిబంధనలను అనుసరిస్తూ పరీక్షా కేంద్రాలను రెడీ చేస్తున్నారు. ఇక విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రం వివరాలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.