Friday, November 22, 2024

బ్రేకింగ్: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

ఏపీలో ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది.

ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలన్న ఏపీ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

పిల్లల ప్రాణాల మీద, వారి భవిష్యత్ మీద మమకారం ఉన్న ప్రభుత్వంగా సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని, కానీ దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్‌ కేసుల కారణంగా పరీక్ష రాయాల్సిన పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ప్రజాప్రభుత్వంగా పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేశామని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలు ప్రకటిస్తుందని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారు చేసినా కానీ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటంతో ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారని ఆయన తెలిపారు. మరికొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారని మంత్రి సురేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement