Friday, November 22, 2024

ఇంటర్‌ బోర్డు య‌వ్వారం.. తప్పుల తడకలుగా హాల్‌టికెట్లు

ప్రభ న్యూస్‌ ప్రతినిధి, నెల్లూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రేప‌టి (6వ తేదీ) నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీనికి ఇంటర్మీడియట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే నెల్లూరు జిల్లా అధికారుల నిర్వాకం కారణంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరీక్షలకు అనుమతించేందుకు హాల్‌ టికెట్లు తప్పనిసరి. ఆ హాల్‌టికెట్లే తప్పులు తడకలుగా ఉండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. హాల్​ టికెట్లపై అడ్రెస్​ లేకుండా ఓన్లీ కోడ్​ ఇవ్వడంతో ఏ సెంటర్​ అనేది తేలియక స్టూడెంట్స్​ ఆయోమయానికి గురవుతున్నారు.

ఉదాహరణకు.. నెల్లూరు నగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న విద్యార్థికి నగరంలో సుమారు 8 బ్రాంచ్‌లు కలిగిన మరో విద్యా సంస్థను పరీక్షా కేంద్రంగా హాల్‌టికెట్‌లో ముద్రించారు. అయితే విద్యాసంస్థ పేరు మాత్రం ముద్రించిన ఇంటర్‌ అధికారులు.. అది ఏ ప్రాంతంలో బ్రాంచ్‌ అన్నది పొందుపరచ లేదు. అదే విధమైన అవకతవకలు దాదాపు ప్రతి ప్రాంతంలోనూ జ‌రిగాయి. దీంతో విద్యార్థులు ఏ పరీక్షా కేంద్రానికి వెళ్లాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కళాశాలల్లో సంప్రదిస్తే సరైన సమాచారం రావడం లేదంటూ వాపోయారు.

అంతేకాకుండా ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో ముందే మిలాఖత్​ అయిన బోర్డు అధికారులు.. ఆన్​లైన్​లో హాల్​ టికెట్​ డౌన్​లోడ్​ చేసుకున్నా.. ఆయా కాలేజీల ప్రిన్సిపాల్​తో సంతకం పెట్టించుకుంటేనే సెంటర్​లోకి అనుమతి ఇస్తారని చెప్పడంతో పేరెంట్స్​లో గుబులు మొదలైంది. ఆ ఫీజు, ఈ ఫీజు అని ఇప్పటికే అందినకాడికి లాగేసిన కాలేజీలు.. ఇప్పుడు ఎగ్జామ్స్ పేరుచెప్పి పిల్లల తల్లిదండ్రుల నుంచి మరింత ఫీజు గుంజేందుకే ఈ తతంగం అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. లంచాలకు అలవాటు పడ్డ ఇంటర్​ బోర్డు అధికారులు.. తలతిక్క పనులతో ఇంటర్​ స్టూడెంట్స్​ పరీక్షల టైమ్​లో ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. నిన్న, మొన్న టెన్త్​ ఎగ్జామ్​ పేపర్ల లీక్​.. ఇప్పుడు ఇంటర్​ పరీక్షల యవ్వారం అంతా ప్రభుత్వానికి తలనొప్పిగా మారే పరిస్థితులున్నాయి. దీనిపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు ముందే జాగ్రత్తపడకపోతే.. మరోసారి యావత్​ ఏపీ వ్యాప్తంగా నెల్లూరు పరువు బజారున పడడం ఖాయం అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement