మానవ చరిత్రలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. సూర్యుని వాతావరణంలోకి తొలిసారిగా మానవుడు తయారు చేసిన అంతరిక్ష నౌక రివ్వున దూసుకుపోయింది. అలా ఒకసారి కాదు.. పదేపదే.. దాదాపు ఆరేడుసార్లు చుట్టివచ్చింది. అక్కడితో ఆగిపోలేదు. ఆ నౌకలోని ప్రత్యేక పరికరాలు నిప్పు కణికల్లా మండుతున్న సూర్యకణాలను, ధూళిని పట్టి.. వాటి గుట్టును, అపురూపమైన ఛాయాచిత్రాలను భూమికి పంపింది. ఇన్నాళ్లూ అంతుపట్టిన అగ్నిగోళం ఆదిత్యుని చెంతకు ఆధునిక మానవుడు జోహారంటూ చేసిన విజయయాత్ర గురించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సగర్వంగా ప్రకటించింది. సూర్యుడి వాతావరణం, అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి 2018లో నాసా పార్కర్ రోదసీ నౌకను ప్రయోగించింది. సూర్యుడిపైకే నేరుగా ఓ అంతరిక్ష నౌకను పంపిన తొలి ప్రయోగం ఇది. 2 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతతో కూడిన సూర్యుడి బాహ్యవలయ వాతావరణాన్ని దాటడమే గగనంగా భావించి మానవుడు చేసిన ఈ తొలి ప్రయత్నం అంచనాలను మించి కొనసాగింది. అదే అద్భుతం. అత్యంత క్లిష్టమైన ఈ అన్వేషణ మానవ జీవితంలో అనూహ్యమైన మార్పులకు నాంది కానుంది.
సౌరకుటుంబంలో కణకణ మండే అతిపెద్ద నక్షత్రం సూర్యుడు. అది రహస్యాల పుట్ట. ఇన్నాళ్లూ మానవుడి మేధకు సవాలు విసిరింది.. ఇప్పుడు అందులోని రహస్యాల ఛేదనకు తొలి అడుగుపడింది. సూర్యుడిలో మార్పులు.. భూమిపై దాని ప్రభావం.. ఇలా అన్ని అంశాల్లోనూ పరిశోధనలకు ఇది ఊతమిస్తుంది.. పాలపుంతలోని మిగతా నక్షత్రాల గురించి అన్వేషణ, అధ్యయానికి ఈ ముందడుగు ఎంతో ఉపకరిస్తుంది.. అని పార్కర్ సోలార్ ప్రోబ్ ప్రయోగబృందంలోని సహాయ పరిపాలనాధికారి ధామస్ జుర్ బుచెన్ పేర్కొన్నారు.
గతంలో ఏ రోదసి నౌక కూడా చేరని విధంగా మెర్యురీ గ్రహానికి ఏడింతల చేరువగా వెళ్లిన పార్కర్, ఆ తరువాత సూర్యుడి వాతావరణంలోకి నేరుగా దూసుకుపోయింది. సూర్యుడిలో ఉష్ణగాలుల తీరు, వేగం, అత్యంత శక్తివంతమైన సూర్యకణాల పుట్టుక, వ్యాప్తి వంటి అంశాలపై పార్కర్ వివరాలు సేకరించి భూమికి చేరవేస్తుంది. సూర్యుడి వాతావరణంలో అడుగుపెట్టడమంటే వేలాది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. దాని దరిదాపులకు వెళితే మాడిమసైపోవడమే. ఆ ఉష్ణోగ్రతను తట్టుకునేలా పార్కర్ రోదసి నౌకను రూపొందించారు. నౌక బయట, లోపలి పరకరాలపై ఆ ఉష్ణోగ్రత ప్రభావం లేకుండా ఉండేందుకు 4.5 అంగుళాల మందాన కార్బన్ సమ్మిళత కవచాన్ని అమర్చారు. సూర్యుడి అంతర్భాగంలో జాలలు రగలడం, వాటి వేగం, అందులోని కణాల పుట్టుక, వ్యాప్తి, భూమిపై వాటి ప్రభావం, కిరణాల ప్రయాణం ఇలా అనేక అంశాలను పార్కర్ అధ్యయనం చేసి వివరాలను చేరవేస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital