ప్రజల కోసం పోలీసులు పడే శ్రమ, ఒత్తిడి గురించి చాలామందికి మాత్రమే తెలుసు. కొంతమంది పోలీసులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోడానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతారు. ప్రజల శ్రేయస్సు, సమాజం కోసం పరితపిస్తుంటారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు ఈ కోవకు చెందినవారే. శాంతిభద్రతలను రక్షించడమే కాదు కష్టాల్లో వున్నవాళ్ళను ఆదుకుని మంచి తనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
గతంలో ఎంతో మందికి సాయం చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. నకిరేకల్ దగ్గర చందుపట్ల గ్రామానికి చెందిన సైదులు(25) అనే యువకుడు ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి తన రెండుకాళ్ళు తీసివేయాల్సి వచ్చింది. అయితే, ఆపేరేషన్ కోసం డబ్బులు లేక తన వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఈ వార్తను వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఎల్బీనగర్ ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ అంజపంల్లి నాగమల్లు వెంటనే సైదులు అడ్మిట్ అయిన ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి అతడికి ధైర్యం చెప్పారు. తోటివారికి కష్ట సమయాల్లో సహకారం అందించాలనే ఉన్నత అధికారుల మాటలే తనకు సహాయం చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయని ఇన్స్పెక్టర్ అంజపంల్లి నాగమల్లు తెలిపారు.
కాగా, గతంలో పలువురికి సాయం చేసి నాగమల్లు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. సూర్యపేట జిల్లా నూతనకల్ మండలం చిలపకుంట్ల గ్రామానికి చెందిన నాగమల్లు హైదరాబాద్లో ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. నాగమల్లు విధుల్లో ఉన్నప్పుడు ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే వెంటనే వారికి సాయం చేస్తారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటారు. గతంలో భారీ వర్షం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తన వీపుపై మోస్తూ నీళ్ల నుంచి బయటకు తీసుకొచ్చాడు. కరోనా సమయంలోనూ ఆయన వివిధ రూపాల్లో సాయం చేశారు.