ఔషధాల తయారీని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేస్తుందీ.. లేనిదీ అధికారుల బృందాలు తేల్చనున్నాయి..ఈ మేరకు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఔషధ తయారీ కంపెనీల్లో పెద్ద ఎత్తున తనిఖీలకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. మన దేశానికి చెందిన మెయిడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్ లను తాగడం వల్ల తమ దేశంలో 66 (తర్వాత ఈ సంఖ్యను గాంబియా 70కు పెంచింది) మంది చిన్నారులు చనిపోయినట్టు ఆఫ్రికా దేశమైన గాంబియా ఆరోపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్నే ప్రకటించింది. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న భారత సర్కారు ఔషధ నియంత్రణ అధికారులతో మెయిడెన్ ఫార్మాలో తనిఖీలు నిర్వహించింది. మెయిడెన్ ఫార్మా స్యూటికల్స్ కు చెందిన నాలుగు దగ్గు, జలుబు మందుల నాణ్యత ప్రమాణాల మేరకే ఉన్నట్టు ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలింది. దీంతో తమ ఆరోపణలకు ఆధారాలను సమర్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థను భారత సర్కారు కోరింది. ఈ ఆరోపణలు భారత ఫార్మా పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీసేవిగా ఉన్నట్టు పేర్కొంది. దగ్గు, జలుబు మందులు ఏవీ కూడా డైఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ తో కలుషితం కాలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, చిన్నారుల మరణాలకు దగ్గు, జలుబు మందులే కారణమన్న గాంబియా హెల్త్ రిపోర్ట్ ను తాను సమర్థిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో కేంద్రం తనిఖీలకు రంగం సిద్ధం చేసింది.