న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని వరద పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. హస్తిన పర్యటనలో ఉన్న ఆయన మూడో రోజైన బుధవారం తన నివాసంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ,హైదరాబాద్‌లో వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పెను ప్రమాదంగా మారి కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులన్నీ సరైన పనితీరును కనబరచలేదు. అపారంగా పంట నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 1400 కోట్ల వరకు నష్టం వాటిల్లందని, ఈ నష్టాలపై ప్రాథమిక అంచనాలను కేంద్రానికి పంపారు.
తక్షణ సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. పలువురు రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వరద సాయం విడుదల, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసన, ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత వంటి అంశాలపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఒత్తిడికి తలొగ్గకుండా డిమాండ్ల సాధనకు శ్రమించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారని పలువురు నాయకులు చెబుతున్నారు. మరోవైపు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్ర నిర్ణయం మీదా టీఆర్‌ఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ముఖ్యమంత్రితో చర్చించాకే బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర హోంమంత్రి వినోద్‌కుమార్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ మార్గనిర్దేశం మేరకే కేంద్ర ప్రభుత్వానికి వినోద్ కుమార్ తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం మీద వివిధ పార్టీల నేతలతో చర్చించేందుకు కేసీఆర్ ఢిల్లీ యాత్ర చేపట్టినట్టు వార్తలు వచ్చినా ఆయన ఎవరినీ కలుస్తున్న దాఖలాలైతే లేవు. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్ కు రుణాలు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ తాజా షరతుల మీదా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రుణ సంస్థల నిర్ణయాల మార్పుపై సీనియర్ అధికారుల నుంచి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.