ప్రధాని నరేంద్ర మోడీ వల్లే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిందని రాష్ట్ర రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయన్నారు. లక్ష35 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు. 2015 నుంచి ఈ రోజుకి సుమారు 50లక్షల అదనపు ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, రైతు బీమా సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కానీ, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవహేళనగా మాట్లాడరని విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయం పండగ మారుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు భాదను కలిగిస్తున్నాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కత్తి కట్టిందని, రైతులను రైతు కూలీలుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అనాలోచిత అసమర్ధ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్ రంగాన్ని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణంగా హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు స్థానం దక్కిందని విమర్శించారు. నల్ల చట్టాల మాదిరే విద్యుత్ చట్టాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విద్యుత్ బిల్లులను అడ్డుకుంటామని శాసనసభ సాక్షిగా చెప్పినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. బిల్లుచట్టంగా మారితే రైతన్నల ఉచిత కరెంటుతోపాటు దళిత, గిరిజన, రజక, నాయి బ్రాహ్మణ వంటి వృత్తుల వారికి, కొన్ని పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ కూడా పోతుందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రుణాలు రాకుండా చేసి వాటిని దివాళా తీయించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని మండిపడ్డారు.