Friday, November 22, 2024

Spl Story: దండుమల్కాపూర్​లో ఇండస్ట్రియల్​ కారిడార్.. ఉపాధికి డోకా లేదంటున్న మునుగోడు ప్రజలు

నల్లగొండ జిల్లా దండు మల్కాపూర్‌లో భారీ పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మునుగోడుకు చాలా దగ్గరల్లోనే ఉండడం ఆ ప్రాంత వాసులకు ఎంతో  కలిసి వచ్చే అంశం కానుంది. 542 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌తో 35 వేల మందికి ఉపాధి లభిస్తుందన్న అంచనా ఉంది. ఇంకా దీన్ని 1863 ఎకరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. అందులో 231 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 106 ఎకరాల్లో బొమ్మల తయారీ యూనిట్లు, 74 ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే షెడ్లు ఉండనున్నాయి.

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిలో చాలామటుకు ఇక్కడి పారిశ్రామిక ప్రాంతంలోనే తయారు చేయవచ్చు. 200కు పైగా కంపెనీల నుంచి రూ.1,985 కోట్ల పెట్టుబడులను రాబట్టబోతున్నట్టు ఓ అంచనా ఉంది. ఇప్పటికే 50 కంపెనీలు దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

కాగా, 194 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతంలోని అధికారులు.. కార్మికుల కోసం టౌన్‌షిప్, విశాలమైన నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ పారిశ్రామిక వాడ రాకతో చాలా సంతోషంగా ఉన్నారు. తమకు పూర్తి పని దొరుకుతుందని, ఇకపై తమ జీవనోపాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే.. తదుపరి దశలో బాలానగర్, జీడిమెట్ల ఏరియాలను కూడా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement