ఇందూరు ఆడబిడ్డలు ఆటల్లోనే కాదు చదువుల్లోనూ సత్తా చాటుతున్నారు. క్రీడల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ జిల్లాకు పేరు తెస్తే.. ప్రస్తుతం సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాకు గౌరవం తెచ్చింది అరుగుల స్నేహ. మూడు సార్లు సివిల్స్‌లో పోరాడిన తర్వాత నాలుగోసారి సివిల్స్‌లో విజయం సాధించారు స్నేహ. మొక్కవోని విశ్వాసంతో సివిల్స్ ర్యాంక్ సాధించే దాకా పోరాటం చేసి చివరికి సక్సెస్ అయ్యారు. చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలన్న టార్గెట్‌తో తన టార్గెట్ రీచ్ అయ్యారు. నిజామాబాద్ సిటీలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ.. థర్డ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు నిర్మల హృదయ హైస్కూల్లో చదువుకున్నారు. ఎప్పుడు 90 శాతం మార్కులతో మంచి స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇంటర్మీడియెట్ మాత్రం హైదరాబాద్‌లో చదివారు.
నాగ్ పూర్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 2017లో పూర్తి చేశారు స్నేహ. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే సివిల్స్ వైపు దృష్టి సారించారు. ఢిల్లీ వెళ్లి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా అర్హత పొందలేదు. నిరుత్సాహపడకుండా రెండో ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లారు కానీ, మెయిన్స్‌లో ఉత్తీర్ణత కాలేదు. మూడో అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ దాకా వెళ్లి ఒక్క మార్కు తేడాతో ర్యాంకు కోల్పోయారు. ఇక.. రెట్టించిన ఉత్సాహంతో నాలుగో ప్రయత్నంలో స్నేహ విజయం దక్కించుకున్నారు.
ఒడిదొడుకులను ఎదుర్కోని..
స్నేహ తల్లి పద్మ, చెల్లెలు సుప్రియ. తల్లి పద్మ కామారెడ్డి కలెక్టరేట్లోని పే అండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్. చెల్లెలు సుప్రియ హైదరాబాద్‌లో సంగీతం టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తన తల్లి అనేక కష్టాలు పడుతూ తనను ఈ విజయం సాధించేందుకు ప్రోత్సహించినట్లు స్నేహ తెలిపారు. చివరి రెండేళ్లలో తన చెల్లెలు సుప్రియ సైతం ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహించినట్లు స్నేహ పేర్కొన్నారు. స్నేహ చిన్నతనంలో కుటుంబ పోషణ తల్లికి భారంగా ఉండేది. నాటి కలెక్టర్ విజయ్ కుమార్ స్నేహ తల్లికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్థికంగా కాస్త పర్వాలేదు. కానీ, స్నేహ కష్టాలను లెక్క చేయకుండా చదువుపై దృష్టి పెట్టారు. తమకు కలెక్టర్ విజయ్ కుమార్ చేసిన సాయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సైతం కలెక్టర్ కావాలనే టార్గెట్ పెట్టుకున్న స్నేహ.. తన కలను నిజం చేసుకున్నారు.