ఈ మధ్య కాలంలో ప్రయాణికుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఇండిగో విమాన సర్వీసు వారి మనసు చూరగొనేలా కొన్ని చర్యలు తీసుకుంటోంది. లైవ్ ఆర్గాన్స్‌ని తక్కువ సమయంలో తీసుకెళ్లి ప్రజల ప్రాణాలను కాపాడడంలో చొరవచూపుతున్నట్టు ఇండిగో తెలిపింది. దీంతో చాలామంది ఆ సంస్థ చేస్తున్న చర్యలను అభినందిస్తున్నారు.
కాగా, గుజరాత్‌లోని వడోదర నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి లైవ్ గుండెను సకాలంలో రవాణా చేసింది ఇండిగో సంస్థ. దీంతో ఒక నిండు ప్రాణం పోకుండా కాపాడారు. గత వారం ఈ ఘటన జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. వడోదర హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ నుంచి లైవ్ గుండెను ఇండిగో విమానంలో ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్‌కి నిర్ణీత 2 గంటల 22 నిమిషాల్లో సురక్షితంగా తరలించినట్లు పేర్కొంది. దీనికి సహకరించి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన సంస్థ సిబ్బందిని ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా అభినందించారు.
‘సురక్షితమైన, సమర్థవంతమైన లాజిస్టిక్స్ ద్వారా సజీవ అవయవాన్ని (గుండె) గ్రహీతకు సకాలంలో చేరవేసి గ్లోబల్ హాస్పిటల్స్ బృందానికి మద్దతు ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం. ప్రతి ప్రాణం విలువైనది. ఒకరిని రక్షించడంలో సహకరించే అవకాశాన్ని ఇండిగో అభినందిస్తున్నది. వడోదర, ముంబైలోని మా విమానాశ్రయ సిబ్బందిని, ఈ ప్రయత్నానికి సహకరించిన ఇతర సిబ్బందిని కూడా అభినందిస్తున్నాం’ అని ఇండిగో సీఈవో పేర్కొన్నారు.
మరోవైపు, ముంబై గ్లోబల్ హాస్పిటల్ కూడా ఇండిగోకు కృతజ్ఞతలు తెలిపింది. 3 గంటలు దాటితే లైవ్ ఆర్గాన్ని మరో వ్యక్తి అమర్చడం కష్టసాధ్యమని డాక్టర్లు తెలిపారు. ఈ క్రమంలో సకాలంలో లైవ్ గుండె రవాణాకు సహకరించిన ఇండిగో బృందానికి ధన్యవాదాలు చెప్పారు. గుండె రవాణాలో ప్రత్యేకంగా సహకరించిన ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో సెక్యూరిటీ మేనేజర్ మనోజ్ దల్వి, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో సెక్యూరిటీ మేనేజర్ రామచంద్ర ద్వివేది, ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌ను అభినందించారు. అంతేకాకుండా గత నెలలో కూడా ఇండిగో విమానంలో పూణె నుంచి ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు విజయవంతంగా రవాణా చేశారు.