దేశంలో రెండో మంకీపాక్స్ కేసు కేరళలో నిర్ధారణ అయ్యింది. కన్నూర్ జిల్లాలో ఇవ్వాల (సోమవారం) వెలుగులోకి వచ్చింది. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన కన్నూర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలను గుర్తించారు. దీంతో అతడిని వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా వ్యాధి బాధితుడు ఈ నెల 13న కన్నూర్‌కు వచ్చినట్టు తెలుస్తోంద. దీంతో అతనితో కాంటాక్ట్‌లో ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్‌ని కూడా పరిశీలనలో ఉంచినట్టు అధికారులు తెలిపారు.
కాగా, జూలై 14న కేరళలోని కొల్లం జిల్లాలో దేశంలోనే మొట్టమొదటి మంకీ పాక్స్ నిర్ధారణ అయ్యింది. మొదటి కేసును గుర్తించినప్పుడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారు.. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో కానీ, సన్నిహితులతో కానీ, చనిపోయిన.. జీవించి ఉన్న అడవి జంతువులుతో కానీ సన్నిహితంగా ఉండకూడదని ఆ గైడ్‌లైన్స్‌లో పేర్కొనారు.
అంతేకాకుండా అంతర్జాతీయ ప్రయాణికులు బుష్‌మీట్ నుండి మాంసాన్ని తినడం కానీ, ఆఫ్రికా అడవి జంతువుల నుండి తయారు చేసిన క్రీమ్‌లు, లోషన్‌ల వంటి ఉత్పత్తులను ఉపయోగించవద్దని అధికారులు సలహా ఇస్తున్నారు. WHO సూచనల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభం నుండి 60 దేశాల్లో దాదాపు 6వేల మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ముగ్గురు చనిపోయారు. అయితే దీనిపై నిఘా పెరిగిన కొద్దీ మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్) మాత్రమేనని. ఇది గతంలో మశూచి రోగులలో కనిపించే లక్షణాలతో ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, 1980లో మశూచి నిర్మూలన జరిగిందన్న ప్రకటనతో.. వ్యాక్సినేషన్‌ను ఆపేసింది. దీంతో మంకీపాక్స్ ప్రజారోగ్యానికి అత్యంత ముఖ్యమైన ఆర్థోపాక్స్ వైరస్‌గా మరో కొత్త అవతారంలో దాడి చేస్తోంది.