మహాంకాళి చేతిలో సిగరెట్.. అమ్మవారు పొగతాగుతున్న పోస్టర్ ఒకటి (స్మోకింగ్ కాళీ) కెనడాలో రిలీజ్ చేశారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఇట్లాంటి పోస్టర్లు అంటించడం తగదని పలు సంఘాలు కంప్లెయింట్స్ చేశాయి. దీంతో కెనడాలోని భారత హైకమిషన్ సోమవారం చాలా సీరిసయస్ అయ్యింది. చిత్రనిర్మాత లీనా మణిమేకలై రిలీజ్ చేసిన ‘స్మోకింగ్ కాళి’ పోస్టర్‌పై కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు “అలాంటి రెచ్చగొట్టే అంశాలన్నింటినీ” ఉపసంహరించుకోవాలని కోరారు.
ఆగాఖాన్ మ్యూజియంలో ‘అండర్ ది టెంట్’ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రదర్శించిన చిత్రం పోస్టర్‌పై హిందూ దేవుళ్లను అగౌరవంగా చిత్రీకరించడంపై కెనడాలోని హిందూ సంఘాల నేతల నుంచి ఫిర్యాదులు అందాయని హైకమిషన్ తెలిపింది. టొరంటోలోని తమ కాన్సులేట్ జనరల్ ఈ ఆందోళనలను ఈవెంట్ నిర్వాహకులకు తెలియజేశారని తెలిపారు. అనేక హిందూ గ్రూపులు కెనడాలోని అధికారులను సంప్రదించి చర్య తీసుకోవాల్సిందిగా తమకు సమాచారం అందించాయని, కెనడా అధికారులు, ఈవెంట్ నిర్వాహకులు ఇట్లాంటి రెచ్చగొట్టే అంశాలన్నింటినీ తీసేయాలని కోరినట్టు తెలిపారు.
మహాకాళీ వివాదం:
చిత్ర నిర్మాత లీనా మణిమేకలై ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం చెలరేగింది. పోస్టర్‌లో కాళీ దేవి వేషధారణలో ఉన్న మహిళను చిత్రీకరించారు. ఆమె ఫొటోలో సిగరెట్ తాగుతూ కనిపించింది. త్రిశూలం, కొడవలితో ఆమె సాధారణ అలంకారాలతో పాటు, దేవత పాత్ర పోషిస్తున్న నటుడు LGBTQ+ కమ్యూనిటీ యొక్క ప్రైడ్ జెండాను పట్టుకుని చూపించారు. ఆమె పోస్టర్‌ను షేర్ చేసిన వెంటనే లీనా మణిమేకలైకి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో సినిమాను ప్రారంభించిన ఆగాఖాన్ మ్యూజియంలో దాన్ని వెంటనే ఆపేయాలని కోరారు. అయితే.. చిత్ర నిర్మాత లీనా మణిమేకలై ఈ సినిమాని తప్పు పట్టే ముందు సినిమా చూడాలని ప్రజలను కోరారు.