ఇతరత్రా కారణాలతో ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం దక్కించుకొని వారు ఇకపై ఎక్కడ నుంచి అయినా ఓటు వేసే అవకాశం రానుంది. ఓటింగ్ శాతం పెంచడం కోసం ఇకపై ఎక్కడి నుంచైనా ఓటేసే సౌకర్యాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. 2024 లోక్ సభ ఎన్నికల నుంచే ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో దానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ‘‘ఐఐటీ చెన్నై, ఇతర ఐఐటీలకు చెందిన సాంకేతిక నిపుణులు బ్లాక్ చెయిన్ ద్వారా ఎక్కడినుంచైనా ఓటేసే పద్ధతిపై అధ్యయనం చేస్తున్నారు.
వీలైతే ఆరు నెలల్లో లేదా ఏడాదిలోగా ‘ఎన్ఆర్ఐ ఓటింగ్’ పద్ధతినీ తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రవాస భారతీయులు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశంపై కేంద్ర న్యాయ శాఖకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఇక ఓటర్ కార్డుతో ఆధార్ ను అనుసంధానించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నారు.