అరేబియా సముద్రంలో పెద్ద ఎత్తున వస్తున్న అలల దాటికి తట్టుకోలేక మునిగిపోతున్న ఓ షిప్ నుంచి 22 మందిని రెస్క్యూ చేశారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. వారిని ప్రాణాలతో కాపాడి తీరానికి తీసుకొచ్చారు. గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో పెద్ద ఎత్తున వస్తున్న అలల కారణంగా MT గ్లోబల్ కింగ్ అనే షిప్ ఇవ్వాల (బుధవారం) ప్రమాదానికి గురైంది. అది గమనించిన కెప్టెన్ కోస్ట్‌గార్డ్‌కి అలర్ట్ మెస్సేజ్ పంపారు. షిప్ మునిగిపోతోంది, తమను కాపాడాలనే ఎమర్జెన్సీ మెస్సేజ్‌తో వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్టు ఇండియన్ కోస్ట్‌గార్డ్ తెలిపింది.
నౌక పోర్‌బందర్‌కు పశ్చిమాన 93 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఈ షిప్ UAEలోని ఖోర్ ఫక్కన్ నుండి దేశంలోని కార్వార్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీనిలో 22 మంది సిబ్బందితో 6,000T బిటుమెన్‌ని తీసుకువెళ్తున్నారు. ఇతర ఏజెన్సీలతో కలిసి కోస్ట్‌గార్డ్ సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే.. ICG రెస్క్యూ ఆపరేషన్ కోసం కొత్తగా ప్రారంభించిన HAL ధృవ్ చాపర్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. కాపాడిన సిబ్బందిలో 20 మంది భారతీయులతో పాటు ఒక పాకిస్థానీ, మరో శ్రీలంక జాతీయుడు ఉన్నారు. వీరిని ఐసిజి నౌకలు, హెలికాప్టర్ల ద్వారా పోర్‌బందర్ పోర్టుకు తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.