ఉక్రెయిన్ లోని భారత పౌరులు, విద్యార్థులను అప్రమత్తం చేసింది భారత ప్రభుత్వం. ఆ దేశంలోని విద్యార్థులు, పౌరులు తక్షణమే స్వదేశానికి వచ్చేయాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని భారత ఎంబసీ పిలుపు ఇచ్చింది. ఉక్రెయిన్‌లోనే ఉండక తప్పని పరిస్థితి ఉన్న పౌరులు తమ ఉనికిని ఎప్పటికప్పుడు ఎంబస్సీకి సమాచారం ఇవ్వాలని తెలిపింది. ఉక్రెయిన్‌లో వారు ఎక్కడ ఉంటున్నారో సమాచారం ఇవ్వాలంది. తద్వారా అవసరమైనప్పుడు ఎంబసీ వారిని అనుసంధానంలోకి తీసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికైతే.. ఉక్రెయిన్‌లోని భారత ఎంబస్సీ పౌరులకు అన్ని సేవలను అందిస్తున్నదని వివరించింది. అమెరికా కూడా ఇప్పటికే ఉక్రెయిన్‌లో తమ దేశ పౌరులను అలర్ట్ చేసింది.
అంతేకాదు, ఆ దేశంలోని యూఎస్ ఎంబస్సీ ఆపరేషన్స్‌ను ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి పశ్చిమ నగరం ల్వీవ్‌కు తరలించింది. ఈ విషయాన్ని అమెరికానే వెల్లడించింది. ఉక్రెయిన్‌తో రష్యా సరిహద్దు వైపునకు సుమారు లక్షకు పైగా ట్రూపులను రష్యా తరలించిందని పేర్కొంది. ఉక్రెయిన్‌పై ఏ సమయంలోనైనా దాడి చేయవచ్చని ఆరోపించింది. ఉక్రెయిన్ దేశాన్ని రష్యా ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నదని పశ్చిమ దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఒక వేళ రష్యా దేశం.. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా.. దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. దౌత్యానికి దారులు తెరిచే ఉన్నాయని వివరించారు. ఉక్రెయిన్ దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలోని భారత పౌరులు, ముఖ్యంగా విద్యార్థులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని ఉక్రెయిన్‌లోని తాత్కాలికంగా ఆ దేశం విడిచి వచ్చేయాలని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..