Monday, November 18, 2024

Followup : థామస్‌ కప్‌ ఫైనల్స్‌లో భారత్‌ ఘన విజయం.. 73 ఏళ్ల తరువాత భారత్‌కు పసిడి

ప్ర‌భ‌న్యూస్ : థాయ్‌లాండ్‌లోని ఇంపాక్ట్‌ అరేనాలో ఆదివారం జరిగిన థామస్‌ కప్‌ ఫైనల్‌లో 14 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇండోనేషియా జట్టును భారత్‌ మట్టికరిపించింది. ఇండోనేషియా జట్టును 3-0 తేడాతో ఓడించిన టీమిండియా బ్యాడ్మింటన్‌ పురుషుల జట్టు.. భారత్‌కు తొలి థామస్‌ కప్‌ అందించింది. 73 ఏళ్ల చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21 తేడాతో జోనటన్‌ క్రిస్టీని వరుస సెట్లలో ఓడించడంతో 3-0 తేడాతో భారత్‌ విజయ కేతనం ఎగురవేసింది. దీంతో బ్మాడ్మింటన్‌లో భారత్‌ మరో అరుదైన ఘనత సాధించింది. 10 మంది భారత్‌ బ్మాడ్మింటన్‌ ఆటగాళ్లు ఈ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకుని కోర్టులోకి వచ్చి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుతం భారీ నజరానా ప్రకటించింది. బ్మాడ్మింటన్‌ జట్టుకు ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ టిట్టర్‌ వేదికగా వెల్లడించారు.

లక్ష్యసేన్‌ అద్భుత విజయం..

ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండోనేషియా ఆటగాడు, ఒలింపిక్స్‌ రజత పతక విజేత ఆంథోనీ గింటింగ్‌ను టీమిండియా 20 ఏళ్ల యువ ఆటగాడు లక్ష్యసేన్‌.. 8-21 పాయింట్ల తేడాతో మొదటి సెట్‌ను కోల్పోయాడు. ఆ తరువాత రెండో సెట్‌లో లక్ష్యసేన్‌ అద్భుతంగా పుంజుకున్నాడు. 21-17 పాయింట్ల తేడాతో గింటింగ్‌ను ఓడించాడు. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్‌ను 21-16 పాయింట్ల తేడాతో కైవసం చేసుకోవడంతో.. లక్ష్యసేన్‌ గెలుపు లాంఛనమైంది. ఫలితంగా భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది. గంటా ఐదు నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో భారత్‌దే విజయమైంది.

చిరాగ్‌ ద్వయం అదుర్స్‌..

ఇక రెండో మ్యాచ్‌లో సాతిక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ అద్భుతంగా రాణించింది. 18-21, 23-21, 21-19 పాయింట్ల తేడాతో ఇండోనేషియా దయం మహ్మద్‌ అహ్సన్‌, కెవిన్‌ సంజయ సుకముల్జోపై ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ తొలి రెండు మ్యాచుల్లో.. తొలి సెట్‌ను కోల్పోయి మరీ విజయం సాధించడం విశేషం. ఇక ఆఖరి మూడో మ్యాచులో టీమిండియా తరఫున ఫేవరేట్‌ అయిన కిదాంబి శ్రీకాంత్‌ బరిలో దిగాడు. ఈ మ్యాచ్‌ కూడా ఆసాంతం ఉదిగ్నంగా సాగింది. భారత్‌ ఆశలన్నీ.. శ్రీకాంత్‌పైనే పెట్టుకుంది. ఇక ప్రపంచ నెంబర్‌ 11 ఆటగాడైన శ్రీకాంత్‌.. ప్రత్యర్థిని రెండు వరుస సెట్స్‌లో ఓడించి ప్రపంచంలో భారత్‌ సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు. 21-15, 23-21 పాయింట్ల తేడాతో ప్రపంచ నెంబర్‌ 8వ ఆటగాడు జొనాటన్‌ క్రిస్టీపై అదితీయ విజయం నమోదు చేసుకోవడంతో.. భారత్‌ స్వర్ణాన్ని ముద్దాడింది.

- Advertisement -

కిదాంబి అదరహో..

తొలి రెండు మ్యాచులు మూడో సెట్‌ వరకు వెళ్లగా.. కిదాంబి శ్రీకాంత్‌ మాత్రం రెండు సెట్స్‌లోనే పని కానిచ్చేశాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్‌ సాగింది. మూడోసెట్‌ వరకు మ్యాచ్‌ వెళ్లే క్రమంలో అద్భుతంగా పుంజుకున్న కిదాంబి శ్రీకాంత్‌.. క్రిస్టీకి మూడో సెట్‌ ఛాన్స్‌ ఇవ్వకుండా రెండో సెట్‌లోనే ఆట ముగించాడు. దీంతో భారత్‌ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. ఇక ఇప్పటికే 3-0 తేడాతో విజయం దక్కడంతో మిగిలిన రెండు మ్యాచుల్లో భారత్‌ తలపడాల్సిన పరిస్థితి రాలేదు. సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌, ధృవ్‌ కపిల డబుల్స్‌ జోడీ కూడా తలపకుండానే కప్‌ భారత్‌ సొంతమైంది.

73 ఏళ్ల కల సాకారం : మోడీ..

క్వార్టర్‌ ఫైనల్స్‌లోనే మహిళ జట్టు నిష్క్రమించగా.. పురుషుల జట్టు మాత్రం చరిత్ర సృష్టించింది. 73 ఏళ్ల కలను సాకారం చేసిన భారత్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. బ్మాడ్మింటన్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన భారత్‌ షట్లర్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌కు స్వర్ణ పతకం ఖాయం కాగానే మోడీ టీట్‌ చేశారు. భారత్‌ బ్యాడ్మింటన్‌ బృందం చరిత్ర సృష్టించింది. ఈ విజయం పట్ల యావత్‌ భారతం గర్వంతో ఉప్పొంగిపోతుంది. స్వర్ణం గెలిచిన భారత బృందానికి శుభాకాంక్షలు.. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి. ఈ విజయం ఎంతో మంది భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.. అంటూ మోడీ టీట్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement