Tuesday, November 26, 2024

ఉత్సాహంలో భారత్..ఒత్తిడిలో ఇంగ్లాండ్..

టెస్ట్, టీట్వంటీ సిరీస్ లు గెలిచి జోరు మీదున్న భారత్‌ ఇప్పుడు రెండో వన్డేతోనే సిరీస్‌పై కన్నేసింది. పర్యాటక జట్టును రిక్తహస్తాలతోనే ఇంటిదారి పట్టించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు అన్నింటా దెబ్బతిన్న ఇంగ్లండ్‌ ఆఖరి సిరీస్‌తోనైనా స్వదేశానికి పయనం కావాలనుకుంటోంది. రెండో మ్యాచ్‌లో గెలిచి తుదిపోరుదాకా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే రసవత్తరంగా జరిగే అవకాశముంది. కోహ్లిసేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే ..పర్యాటక జట్టు ఒత్తిడిలో ఉంది. కెప్టెన్‌ మోర్గాన్‌ గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కావడం ఆ జట్టుకు మరో దెబ్బ.

కొత్త కుర్రాళ్ల జోరుకు సీనియర్ల సత్తా తోడవడంతో మొదటి వన్డేలో భారత్‌కు తిరుగులేకుండా పోయింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ ఓ దశలో వణికించినా బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. బ్యాటింగ్ విభాగంలో భారత్ పటిష్ఠంగా ఉంది. ముంజేతికి గాయమైనా ఓపెనర్‌ రోహిత్‌ ఫిట్‌గానే ఉన్నాడు. ఒకవేళ రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తే ధవన్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు. రాహుల్‌ ఎప్పటిలాగే మిడిలార్డర్‌లో బరిలోకి దిగుతాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ గాయపడడంతో అతడి స్థానంలో పంత్‌ బరిలోకి దిగనున్నాడు. అతడిని బ్యాట్స్‌మన్‌గానే పరిమితం చేస్తారని సమాచారం. అంటే.. రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తాడు.

ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ దూరమవడం పెద్ద దెబ్బే…మొదటి మ్యాచ్ లో ఆరంభంలో ధాటిగానే ఆగిన తరువాత ఒకరి తరువాత ఒకరు పెవిలీయన్ కి చేరడం ఆ జట్టు కూర్పు పై ఎపెక్ట్ పడుతోంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement