న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దోస, కీరదోస ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రతియేటా 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన దోస, కీరదోస ఎగుమతులు చేస్తోంది. 2021లో ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో 114 మిలయన్ డాలర్ల విలువైన 1,23,846 మెట్రిక్ టన్నుల కీరదోసను భారత్ ఎగుమతి చేసింది. అంతకు ముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 223 మిలియన్ డాలర్ల విలువైన 2,23,515 మెట్రిక్ టన్నుల ఎగుమతులు జరిగాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ అవసరాల్లో 15% భారత్ నుంచే ఎగుమతి అవుతోందని వివరించింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని ‘అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA)’ ఈ మేరకు ఎగుమతులకు అవసరమైన మౌలిక వసతులు, మార్కెటింగ్, ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ తదితర సహాయ సహకారాలు అందజేస్తోంది. ప్రాసెస్ చేసి వెనిగర్, ఎసిటిక్ యాసిడ్‌లో భద్రపర్చే విధానంలో ఎక్కువ శాతం మేర ఎగుమతి అవుతుండగా, నేరుగా ప్రాసెసింగ్ చేసి జరిపే ఎగుమతులు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. భారత్ నుంచి అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్, సౌత్ కొరియా, కెనడా, జపాన్, బెల్జియం, రష్యా, చైనా, శ్రీలంక, ఇజ్రాయల్ తదితర దేశాలకు ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి.
భారత్‌లో 1990లలో తొలుత కర్నాటకలో వీటి సాగు మొదలైంది. ప్రస్తుతం కర్నాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా సాగవుతోంది. 65 వేల ఎకరాల్లో 90 వేల మంది రైతులతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానంలో సాగవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సగటున ఎకరాకు ఒక పంటకు 4 మెట్రిక్ టన్నుల దిగుబడితో రైతుకు రూ. 80 వేల వరకు ఆదాయం వస్తుందని, ఇందులో సగం మేర, అంటే రూ. 40 వేల వరకు ఆదాయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏడాదిలో 2 పంటలు సాగవుతాయని వివరించింది.