దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3వ తేదీ నుంచి 15-18 ఏళ్ల లోపు వయసు వారికి కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శనివారం(డిసెంబర్ 25) రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. చిన్నారులకు టీకా పంపిణీపై ప్రకటన చేశారు.
ఒమిక్రాన్ వల్ల భయం లేకపోయినా అప్రమత్తత అవసరమన్న మోదీ.. 60 ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై ‘ప్రికాషన్ డోసు’ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి టీకాలు వేస్తామన్నారు. మూడో డోసును అందరూ బూస్టర్ డోసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో మోదీ మాత్రం దానిని ‘ప్రికాషన్’ డోసుగా పేర్కొన్నారు.
ఈ ఏడాది జనవరి 16న టీకాల పంపిణీ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల్ని పంపిణీ చేసినట్టు మోదీ చెప్పారు. జనాభాలో 61శాతం మందికి టీకాలు అందినట్టు వివరించారు. అలాగే 90 శాతానికి పైగా ఒక డోసు అందిందన్నారు. ఇప్పుడు 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి టీకాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. కరోనాపై పోరాటంలో మన అనుభవాలే గొప్ప ఆయుధాలని మోదీ పేర్కొన్నారు. కాబట్టి అనవసర అపోహలు వద్దని, పండగల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..