31 ఏళ్ల నైజీరియా మహిళకు బుధవారం మంకీపాక్స్ పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇది నాలుగో కేసు కాగా, దేశంలో ఇప్పటి వరకు తొమ్మిది మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. జ్వరం, చర్మంపై బొమ్మలు.. కురుపులు రావడంతో మంకీపాక్స్ పరీక్ష చేయించారు. దీంతో పాజిటివ్‌గా నిర్ధరాణ అయ్యింది. దేశంలో వ్యాధిసోకిన మొదటి మహిళగా డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, చర్మంపై బొబ్బలున్నాయి. దీంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్(LNJP) ఆసుపత్రిలో చేరింది. అయితే.. ఈ మహిళ కూడా ఎట్లాంటి విదేశాలకు వెళ్లినట్లు సమాచారం లేదు.
దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు చేయాల్సినవి, చేయకూడనివి జాబితాను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. వైరస్ సోకిన వ్యక్తితో ఎక్కువ కాలం గడపవద్దని, పదే పదే వారితో తిరగడం వల్ల కూడా వైరస్‌ను అంటుకుంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
అయితే.. మంకీపాక్స్ సోకిన వ్యక్తిని కాస్త విడిగా ఉంచాలని కూడా మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం, సబ్బు, నీటితో చేతులు కడుక్కోవడం.. రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మాస్క్ లతో నోటిని, చేతికి డిస్పోజబుల్ గ్లోవ్స్ తో కవర్ చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని తెలిపింది.
కేంద్రం జారీ చేసిన ‘మంకీపాక్స్ వ్యాధి నిర్వహణపై మార్గదర్శకాలు’ గత 21 రోజులలో ప్రభావిత దేశాలకు ప్రయాణించిన చరిత్ర కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం తెలిపింది. అట్లాంటి వారికి తీవ్రమైన దద్దుర్లు, కురుపులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో ఉంటే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. బాడీ పెయిన్స్, తీవ్ర బలహీనత ఉంటే కూడా ‘అనుమానాస్పద కేసు’గా పరిగణించాలని కేంద్రం తెలిపింది.
మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్) వ్యాధి. ఇది గతంలో మశూచి రోగులలో కనిపించే లక్షణాలతో ఉంటుంది. అయితే.. ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతను కలిగి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.
కాగా, లక్షణాలు సాధారణంగా జ్వరం ప్రారంభమైనప్పటి నుండి ఒకటి నుండి మూడు రోజులలోపు కురుపులు కనుక వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. దాదాపు రెండు నుండి నాలుగు వారాల పాటు ఇట్లాంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి. అవి దురదగా మారినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అరచేతి నుంచి అరికాళ్ల దాకా ఇట్లాంటి బొబ్బలు ఉండడం మంకీపాక్స్ వైరస్ ప్రధాన లక్షణంగా డాక్టర్లు చెబుతున్నారు.