దేశంలో ఓమిక్రాన్ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని 21 రాష్ట్రాలకు ఓమిక్రాన్ కేసులు విస్తరించాయి. దేశంలో ఇప్పటి వరకు 781 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ నుంచి 241 మంది కోలుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యధిక ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 238 కేసులు వెలుగులోకి వచ్చాయి. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర 167 కేసులతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్ 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్ 46, తమిళనాడు, కర్ణాటకలో 34, హర్యానా 12, పశ్చిమ బెంగాల్ లో 11, మధ్య ప్రదేశ్ లో 9, ఒడిశా లో 8, ఆంద్ర ప్రదేశ్ 6, ఉత్తరాఖండ్ 4 కేసులు, చండీగఢ్, జమ్మూకశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, లడఖ్ లలో ఒక్కో ఓమిక్రాన్ కేసు నమోదైంది.
మరోవైపు ఓమిక్రాన్ కారణంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలు ఆంక్షల ఛట్రంలోకి వెళ్లాయి. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.
కేసులు పెరుగుదలతో ఢిల్లీ సర్కారు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సోమవారం(డిసెంబర్ 27) నుంచి అక్కడ రాత్రి కర్ఫ్యూ అమల్లోకి చేస్తున్నారు. కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రజలు పాటించకపోవడంతో కేజ్రీవాల్ సర్కార్ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. దీంతో మాల్స్, రెస్టారెంట్లు, దుకాణాలు, సినిమా హాళ్లు, స్పాలు, రవాణా, జిమ్‌ల కార్యకలాపాలపై మరోసారి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మాల్స్, దుకాణాలు సరి-బేసి విధానంలో తెరవనున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రయివేట్ కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయనున్నారు. అలాగే, వివాహాలు, వేడుకలకు కేవలం 20 మందిని అనుమతిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital