మొబైల్, పీసీ గేమింగ్ రంగంలో భారతదేశం అత్యంత వేగంగా దూసుకుపోతోంది. థాయిలాండ్, ఫిలిప్పీన్స్ తర్వాత ఎక్కుమంది గేమర్లు ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. అంతేకాకుండా గేమ్స్ ద్వారా రాబడి.. గేమర్ల సంఖ్యలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లుగా భారత్, థాయిలాండ్, ఫిలప్పీన్స్ నిలుస్తున్నాయి. ఇక.. ఆసియా టాప్-10లో జపాన్, కొరియా అత్యంత పరిణతి చెందిన గేమింగ్ మార్కెట్లుగా ఉన్నాయని.. ఆదాయంలో 77 శాతానికి పైగా వాటా పొందుతున్నట్టు ఓ ప్రైవేటు సంస్థ నివేదిక వెలువరించింది.
– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
భారతదేశం ఇప్పుడు గేమింగ్ రంగంలోనూ యమ స్పీడుగా దూసుకుపోతోంది. మొబైల్, కంప్యూటర్ గేమ్స్ పరంగా రోజు రోజుకూ గేమర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ నికోపార్ట్నర్స్ ఈ మధ్యకాలంలో జరిపిన సర్వేని విడుదల చేసింది. ఇందులో భారత్‌లోనే 396.4 మిలియన్ల మంది గేమర్లున్నట్టు వెల్లడయ్యింది. ఇక.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గేమర్ బేస్‌ను భారతదేశం కలిగి ఉందని ఆ నివేదిక తెలియజేస్తోంది.
మార్కెట్ పరిశోధన సంస్థ నికో పార్ట్ నర్స్ అందించిన డేటా ప్రకారం టాప్ 10 ఆసియా దేశాల జాబితాలోని మొత్తం గేమర్లలో భారతదేశం ఇప్పుడు 50.2 శాతం వాటా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. రాబడిలో 21 శాతం వాటాతో 5 సంవత్సరాల వృద్ధి రేటుతో భారతదేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని ‘ది ఆసియా-10 గేమ్స్ మార్కెట్’ పేరుతో ఓ నివేదిక తెలియజేస్తోంది.
కాగా, గేమింగ్ రంగంలో భాగంగా ఆసియా టాప్-10లోని దేశాలు PC, మొబైల్ గేమ్ మార్కెట్ 2022లో 35.9 బిలియన్ డాలర్లు, 2026లో 41.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంటాయని నికోపార్టనర్స్ అంచనా వేసింది. ఆదాయం కంటే గేమర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. భారతదేశం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ ఆటల రాబడితోపాటు.. గేమర్ల సంఖ్య వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో జపాన్, కొరియా అత్యంత పరిణతి చెందిన మార్కెట్లుగా ఉన్నాయని, ఆదాయంలో 77 శాతానికి పైగా వాటా ఉందని ఈ నివేదిక పేర్కొంది.