Saturday, November 23, 2024

45 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి.. రష్యాకు ఆర్డరిచ్చిన భారత్

ఇండియాలో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి భారత కంపెనీలు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల ఆయిల్ కోసం ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ షిప్‌మెంట్ ఏప్రిల్ నెలలో భారత్‌కు చేరనుంది. ప్రపంచంలో అత్యధికంగా వంటనూనెలు దిగుమతి చేసుకునే భారత్‌.. కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మలేషియా, ఇండోనేషియా దేశాలు పామాయిల్, సోయా ఆయిల్ ఎగుమతులు తగ్గించేయడంతో మన మార్కెట్లు దెబ్బతిన్నాయి.

వీటికితోడు రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి వచ్చే సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు కూడా రావడం లేదు. భారత్‌కు అత్యధికంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎగుమతి చేసే దేశాలైన రష్యా, ఉక్రెయినే. అయితే .. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి దిగుమతులు ఆగిపోవడంతో.. రష్యా వైపు భారత్ చూస్తోందని జెమిని ఎడిబిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఈ కంపెనీ రష్యా నుంచి 12 వేల టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోలు చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతం టన్ను సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను 2,150 డాలర్లకు భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది రికార్డు ధర. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు ఈ ధర కేవలం 1,630 డాలర్లుగానే ఉండేదని సమాచారం. గత నెల రోజులుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కుదరలేదని, కానీ ఇప్పుడు దిగుమతులకు కూడా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)లు లభిస్తున్న తరుణంలో మళ్లీ రష్యా నుంచి కొనుగోళ్లు ప్రారంభించారని దిగుమతి వ్యాపారులు వివరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement