Tuesday, November 19, 2024

2022లో భారత్‌ బిజీ.. సౌథాఫ్రికా, శ్రీలంక జట్లతో వరుస మ్యాచ్ లు.. విశాఖలో విండీస్ తో టీ20..

కొత్త సంవత్సరం 2022లో భారత జట్టు తీరికలేకుండా వరుస సిరీస్‌లతో గడపనుంది. జనవరి 3వ తేదీ సోమవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టుతో భారత జట్టు ఈ ఏడాది తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. జనవరి 3నుంచి జనవరి 7 శుక్రవారం వరకు భారత్‌-దక్షిణాఫ్రికా రెండో టెస్టు జోహన్స్‌బర్గ్‌లోని వాండెరర్స్‌స్టేడియం వేదికగా జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30కు ఈ టెస్టు ప్రారంభమవుతుంది. అనంతరం మూడు టెస్టుల సిరీస్‌లోని చివరి టెస్టు జనవరి 11 మంగళవారం నుంచి 15శనివారం వరకు కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతుంది. చివరి టెస్టు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు జరుగుతుంది. టెస్టు సిరీస్‌ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని తొలి వన్డే జనవరి 19 బుధవారం బోలాండ్‌ పార్క్‌ వేదికగా, రెండో వన్డే జనవరి 21 శుక్రవారం అదేవేదికగా జరగనుండగా, మూడో వన్డే జనవరి 23 ఆదివారం కేప్‌టౌన్‌ వేదికగా జరుగుతుంది.



విశాఖ వేదికగా విండీస్‌తో టీ20
జనవరిలో సఫారీలతో సిరీస్‌ అనంతరం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో భాగంగా విండీస్‌ భారత్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్‌లోని తొలి వన్డే ఫిబ్రవరి 6 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనుంది. అనంతరం రెండో వన్డే ఫిబ్రవరి 9 బుధవారం జైపుర్‌లోని మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా, మూడో వన్డే ఫిబ్రవరి 12 శనివారం కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా జరుగుతుంది. మూడు వన్డేలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతాయి. అనంతరం ఫిబ్రవరి 15నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి టీ20 కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15 మంగళవారం జరగనుంది. అనంతరం రెండో టీ20 విశాఖ వేదికగా ఫిబ్రవరి 18 శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి 7గంటలకు జరగనుంది. వెస్టిండీస్‌తో మూడో టీ20 ఫిబ్రవరి 20 ఆదివారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం వేదికగా జరగనుంది.

ఫిబ్రవరిలోనే శ్రీలంక పర్యటన..
వెస్టిండీస్‌ పర్యటన ముగిసిన మరో 5రోజుల వ్యవధిలోనే శ్రీలంక పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌లో పర్యటించనున్న శ్రీలంక జట్టు రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనుంది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లోని తొలి టెస్టు ఫిబ్రవరి 25నుంచి బెెంగళూరు వేదికగా ప్రారంభం కానుంది. రెండు టెస్టు మ్యాచ్‌లు ఉదయం 9.30కు ఆరంభమవుతాయి. సిరీస్‌లోని రెండో టెస్టు మార్చి 5నుంచి మార్చి 9వరకు మొహాలీ వేదికగా జరుగుతుంద. టెస్టు సిరీస్‌ ముగిసిన తరువాత మూడు మ్యాచ్‌ల టీ20సిరీస్‌లోని తొలి టీ20 మార్చి 13 ఆదివారం మొహాలీ వేదికగానే జరుగుతుంది. ఆ తర్వాత రెండో టీ20 మార్చి 15మంగళవారం ధర్మసాల వేదికగా జరగనుంది. టీ20 సిరీస్‌ రాత్రి 7గంటలకు ప్రారంభం కానుంది. మార్చి 18 శుక్రవారం జరగనుండగా ఈ మ్యాచ్‌తో శ్రీలంక జట్టు భారత పర్యటన ముగుస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement