Tuesday, November 26, 2024

టాస్ ఎవరిది? సిరీస్ ఎవరిది?

భారత్-ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ తుది అంకానికి చేరింది. తొలి నాలుగు టీ20ల్లో నువ్వా.. నేనా అన్నట్లు తలపడిన ఈ రెండు జట్లు ఇవాళ ఆఖరి టీ20 అంటే ఫైనల్ ఆడనున్నాయి. ఇప్పటి వరకు సిరీస్‌లో సమఉజ్జీలుగా నిలిచిన రెండు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ కీలకంగా మారనుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన జట్టే మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌లో టాస్ ఓడినా భారత్ భారీ స్కోరు చేసింది కాబట్టి బతికిపోయింది. ఎందుకంటే ఇంగ్లండ్ విజయానికి చేరువగా వచ్చి కేవలం 8 పరుగుల తేడాతోనే ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

టీమిండియాకు ఓపెనర్లు రోహిత్, రాహుల్ విఫలమవడం కలవరపెడుతోంది. విరాట్, సూర్యకుమార్ మంచి ఫాంలో ఉన్నారు. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సుందర్ స్థానంలో రాహుల్ తెవాటియా ఇవాళ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఫిట్‌నెస్ కారణంగా గత నాలుగు మ్యాచ్‌లలో అతడికి అవకాశం లభించలేదు. అటు ఈ సిరీస్‌లో భారత్‌‌తో పోలిస్తే ఇంగ్లండ్ బౌలింగ్ బాగుందనే చెప్పాలి. మార్క్ వుడ్, ఆర్చర్, జోర్డాన్ మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ టీమిండియా టాపార్డర్‌ను పరీక్షకు గురిచేస్తున్నారు. చివరి మ్యాచ్‌లోనైనా మన బౌలర్లు భువనేశ్వర్, శార్దూల్ గాడిన పడతారో లేదో చూడాలి. కాగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement