Friday, November 22, 2024

భారత్‌.. బిలియనీర్స్‌.. భారీగా పెరిగిన సంపద, 142కు చేరిన సంపన్నులు

న్యూఢిల్లి : కరోనా మహమ్మారి సమయంలో కూడా కొందరి సంపద భారీగా పెరుగుతున్నది. రోజురోజుకూ వారి సంపద వేల కోట్లు పెరుగుతున్నాయి. రెండేళ్లుగా కరోనా మహమ్మారి దేశాన్ని వెంటాడుతూనే ఉంది. ఉపాధి లేక చాలా మంది చేతుల్లో చిల్లి గవ్వ లేకుండా పోయింది. అయితే కొంత మంది చేతుల్లో మాత్రం వేల కోట్లు వచ్చిపడ్డాయి. ఈ కాలంలో దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. 2021లో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగింది. 2020లో 102 మంది ఉన్న బిలియనీర్లు కాస్త.. 2021 నాటికి 142కు చేరుకున్నారు. సోమవారం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ 2022 తొలి రోజు కావడంతో.. ఆక్స్‌ఫామ్‌ ఇండియా వార్షిక అసమానత సర్వేను విడుదల చేసింది. కరోనా కాలంలో.. భారతీయ బిలియనీర్ల చేతుల్లో ఉన్న సంపద రెండింతలు పెరిగింది. నివేదిక ప్రకారం.. దేశంలోని 142 మంది బిలియనీర్ల వద్ద ఉన్న మొత్తం సంపద విలువ అక్షరాల 719 బిలియన్‌ డాలర్లు.. అంటే సుమారు రూ.53 లక్షల కోట్లు అన్నమాట.

10 శాతం సంపన్నుల భారీ సంపద
వీరిలోని టాప్‌ 10 మంది బిలియనీర్ల వద్ద ఉన్న డబ్బులతో ఓ మంచి పని చేయవచ్చు. దేశంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను రాబోయే 25 ఏళ్ల పాటు నిర్వహించగలమని ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక తెలియజేస్తున్నది. రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తున్నది. దీంతో ధనికులు పేదోళ్లు అయితే.. మరికొంత మంది బిలియనీర్లుగా మారిపోయారు. పేదోడు అయితే మరింత పేదరికంలో నెట్టేయబడ్డాడు. దీంతో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. దేశంలోని 10 శాతం సంపన్నుల వద్ద దేశ సంపదలో 45 శాతం ఉంది. అదే సమయంలో దేశంలోని 50శాతం పేద జనాభా వద్ద ఉన్నది కేవలం 6 శాతం సంపద మాత్రమే ఉంది. కరోనా కాలంలో ఆక్సిజన్‌ లేక ఎంతో మంది చనిపోయారు. ఈ విషయంలో ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఓ చక్కని ఉదాహరణ ఇచ్చింది. దేశంలోని టాప్‌ -10 బిలియనీర్లపై 1 శాతం అదనపు పన్ను విధిస్తే.. ఆ డబ్బుతో 17.7 లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేయవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్‌ భారత్‌. అదేవిధంగా 98 మంది బిలియనీర్లపై 1 శాతం అదనపు పన్ను విధిస్తే.. ఆ డబ్బుతో వచ్చే ఏడేళ్ల పాటు ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమాన్ని ఎంతో బాగా కొనసాగించొచ్చు.

90 బిలియన్‌ డాలర్లకు అదానీ
అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ సంపద గత సంవత్సరంలో అతిపెద్ద పెరుగుదలను నమోదు చేసింది. అదానీ గ్రూప్‌ గతేడాది భారతదేశంలో అత్యధిక నికర విలువను కలిగి ఉన్న.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సంపదలో ఐదో అతిపెద్ద పెరుగుదలను నమోదు చేసింది. గౌతమ్‌ అదానీ సంపదలో 42.7 బిలియన్‌ డాలర్లు వచ్చి చేరాయి. దీంతో అదానీ సంపద ఇప్పుడు 90 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ముఖేష్‌ అంబానీ నికర విలువ 2021లో 13.3 బిలియన్‌ డాలర్లు పెరిగి.. ఇప్పుడు 97 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 55.5 కోట్ల మంది పేదల వద్ద ఉన్న సంపద కేవలం 98 మంది బిలియనీర్ల వద్దే ఉంది. ఇది దాదాపు 657 బిలియన్‌ డాలర్లు. అంటే.. అక్షరాలా రూ.49లక్షల కోట్లు. ఈ 98 కుటుంబాల మొత్తం సంపద భారత ప్రభుత్వ మొత్తం బడ్జెట్‌లో 41 శాతం ఉంటుందని ఆక్స్‌ఫామ్‌ ఇండియా తెలిపింది.

టాప్‌లో ఎలన్‌ మస్క్‌
అదేవిధంగా ఎంతో చక్కని ఉదాహారణలను ఆక్స్‌ఫామ్‌ ఇండియా ఇచ్చింది. భారత్‌లోని టాప్‌-10 ధనవంతులు రోజుకు ఒక మిలియన్‌ డాలర్లు అంటే.. 7.4 కోట్లు ఖర్చు చేసినా.. వారి సంపద ఖర్చు చేయడానికి 84 ఏళ్లు పడుతుంది. దేశంలోని ధనవంతులపై సంపద పన్ను విధిస్తే.. అప్పుడు 78.3 బిలియన్‌ డాలర్లు అంటే రూ.5.8 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో వచ్చి చేరుతాయి. ఈ డబ్బుతో ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్‌ 271 శాతం పెరగొచ్చు. కరోనా కాలంలో మహిళలే ఎక్కువ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. 28 శాతం మంది మహిళల ఉద్యోగాలు పోయాయి. దీంతో వారి మొత్తం సంపాదన మూడింట రెండు వంతులు తగ్గింది. ఆక్స్‌ఫామ్‌ ఇండియా ప్రకారం.. ప్రపంచంలో అయితే ఎలన్‌ మస్‌ ్క, జెఫ్‌ బెజోస్‌, లారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌, మార్క్‌ జుకర్‌ బర్గ్‌, బిల్‌ గేట్స్‌, స్టీవ్‌ బాల్మర్‌, లారీ ఎల్లిసన్‌, వారెన్‌ బఫెట్‌, బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ టాప్‌-10 సంపన్నులుగా ఉన్నారు. కరోనా దెబ్బకు 16 కోట్ల మంది పేదరికంలోకి నెట్టేయబడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement