జీ-20కి భారత్ అధ్యక్షత వహించడం దేశంలోపల, వెలుపల సమ్మిళితం, ఐక్యతకు ఒక సంకేతంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అనాదికాలంగా వేధిస్తున్న సవాళ్ళకు సరికొత్త పరిష్కారాలను కనుగొనడంలో అంతర్జాతీయ విశ్వసనీయత లేమిని విశ్వాసంగా మార్చాలని ప్రపంచనేతలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లిdలోని భారత్ మండపంలో రెండు రోజుల జీ-20 శిఖరాగ్ర సదస్సును శనివారం ఆరంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. జీ20 అధ్యక్ష స్థానంలో భారత్ సభికులందరికీ స్వాగతం పలుకుతోందని అన్నారు.
వేల ఏళ్ళ క్రితమే ప్రపంచానికి భారత్ సందేశం
”ఇక్కడికి కొద్ది కి.మీ.ల దూరంలో దాదాపు 2,500 సంవత్సరాలనాటి స్థూపం ఒకటి నిటారుగా నిలిచి ఉంది. ఆ స్థూపంపై ప్రాకృత భాషలో ‘మానవాళి సంక్షేమం, సంతోషం నిత్యం నిశ్చయముగా ఉండాలి’ అని రాసి ఉంది. అలాంటి ఒక సందేశాన్ని భరత భూమి రెండువేల ఐదు సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచానికి ఇచ్చింది. సందేశాన్ని స్మరించుకుంటూ జీ-20 శిఖరాగ్ర సదస్సును ప్రారంభించకుందాం” అని మోడీ అన్నారు.
మానవ కేంద్రీకృత విధానాన్ని అనుసరిద్దాం
యావత్ ప్రపంచానికి సరికొత్త దిశను ఇచ్చే సామర్థ్యాన్ని 21వ శతాబ్దం సంతరించుకుందని చెప్పారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న సవాళ్ళకు కొత్త పరిష్కారాలను మన నుంచి పట్టుబట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక మానవ కేంద్రీకృతమైన విధానంతో మన అన్ని బాధ్యతలను నెరవేర్చడానికి మనం ముందుకు సాగాలని అన్నారు. కొవిడ్ అనంతరం ప్రపంచంలో కొరవడిన విశ్వసనీయత రూపేణా ఒక అతి పెద్ద సంక్షోభం నెలకొంది. సంఘర్షణ ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని చెప్పారు. కొవిడ్‌ను అధిగమించిన తీరుగా పరస్పర విశ్వసనీయ తాలూకు ఈ సంక్షోభాన్ని కూడా మనం అధిగమించగలమని ప్రధాని మోడీ అన్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయంగా కొరవడిన ఈ విశ్వసనీయతను అంతర్జాతీయ విశ్వసనీయత, విశ్వాసంగా మార్చేందుకు ముందుకు రావాలని జీ-20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ యావత్ ప్రపంచాన్ని ఆహ్వానిస్తోందని తెలిపారు.
మానవాళికి దారి చూపే దీపం
మనందరం కలిసికట్టుగా ముందుకు నడిచే సమయం ఆసన్నమైందని ప్రధాని చెప్పారు. ఆ క్రమంలో ‘సబ్‌కా సాత్(అందరితో), సబ్‌కా వికాస్(అందరి అభివృద్ధి), సబ్‌కా విశ్వాస్(అందరి విశ్వాసం), సబ్‌కా ప్రయాస్(అందరి ప్రయత్నం)’ అనే మంత్రం మనందరికి దారి చూపే ఒక దీపంగా ఉంటుందని తెలిపారు. ఆర్థికం నుంచి ఆహారం దాకా సవాళ్లకు పరిష్కారాలు కనుగొందాం
”అల్లకల్లోలంగా ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కావొచ్చు లేదా ఉత్తర-దక్షిణ విభజన లేదా ప్రాక్ పశ్చిమాల మధ్య దూరం లేదా ఆహారం, ఇంధనం, ఎరువుల నిర్వహణ లేదా టెర్రరిజమ్, సైబర్ భద్రతతో వ్యవహరించడం లేదా ఆరోగ్యం, విద్యుత్, నీటి భద్రతకు భరోసా కల్పించడం లాంటి సవాళ్లకు కేవలం వర్తమానానికి మాత్రమే కాకుండా భవిష్యత్తు కోసం నిర్మాణాత్మకమైన పరిష్కారాల దిశగా మనం ముందుకు సాగుదాం” అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
సబ్‌కా సాత్(అందరితో) స్ఫూర్తిగా జీ-20కి భారత్ అధ్యక్షత వహించడం దేశంలోపల, వెలుపల సమ్మిళతం, ఐక్యతకు ఒక సంకేతంగా మారిందని మోడీ అన్నారు. అది ప్రజల జీ-20గా మారిందని, లక్షలాదిగా భారతీయులు ఇందులో మమేకమైనారని చెప్పారు. దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో 200పైగా సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. సబ్‌కా సాత్ స్ఫూర్తితో ఆఫ్రికా యూనియన్‌కు జీ-20లో శాశ్వత సభ్యత్వాన్ని భారత్ ప్రతిపాదించిందని, ఈ ప్రతిపాదనను సభ్యులందరూ ఆమోదిస్తారని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పారు. మున్ముందు కార్యక్రమాలతో ముందుకు సాగే ముందు, సభ్యులందరిలో ఆమోదంతో జీ-20 శాశ్వత సభ్యత్వ స్థానాన్ని చేపట్టాల్సిందిగ ఆఫ్రికా యూనియన్ చైర్‌పర్సన్‌ను తాను ఆహ్వానిస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు.
మొరాకోను ఆదుకోవడానికి సిద్ధం
జీ-20 సదస్సు ఆరంభ ప్రసంగంలో సదస్సులో పాల్గొన్న వారందరి తరఫున మొరాకో భూకంపంలో మరణించినవారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కష్టకాలంలో యావత్ ప్రపంచం మొరాకో దేశానికి అండగా ఉంటుందని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్దంగా ఉన్నట్టు ప్రధాని తెలిపారు.