దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో తాజాగా 3,60,960 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. అటు దేశంలో ఒక్కరోజులో మరణాల సంఖ్య తొలిసారిగా 3వేలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,293 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 2,01,187గా నమోదైంది. మరోవైపు ఒక్కరోజులో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టివ్ కేసులున్నాయి.
అటు తెలంగాణలోనూ కరోనా విలయ తాండవం సృష్టిస్తోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 8,061 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా మరో 56 మంది కరోనాకు బలయ్యారు. 5,093 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరింది. ప్రస్తుతం 72,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ర్ట వ్యాప్తంగా 82,270 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 8 వేల మందికి పైగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,508 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 673, రంగారెడ్డిలో 514, సంగారెడ్డి జిల్లాలో 373, మహబూబ్‌నగర్ జిల్లాలో 328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.