బెంగళూరు వేదికగా జరుగుతున్న డే నైట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 109 పరుగులకే కుప్ప కూలింది. స్టార్ పేసర్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశాడు. ఓవర్ నైట్ స్కోరు 86-6తో నేడు రెండో రోజు ఆట ప్రారంభించిన శ్రీలంక… కాసేపట్లోనే ఇన్నింగ్స్ ముగించింది. నిన్న 3 వికెట్లు తీసిన బుమ్రా ఇవాళ ఆట ఆరంభంలోనే 2 వికెట్లు తీశాడు. మిగిలిన రెండు వికెట్లను అశ్విన్ పడగొట్టాడు.
లంక ఇన్నింగ్స్ లో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేయగా, ఎంబుల్దెనియ 21 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్మరే చేసిన లసిత్ ఎంబుల్దేనియా.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అశ్విన్ బౌలింగ్‌లో లక్మల్ క్లీన్ బౌల్డ్ కాగా.. తరువాతి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో డిక్‌వాలా.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు కీలకమైన 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.