Saturday, November 23, 2024

Big Story: పెరిగిన ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు.. కరోనా ఎఫెక్టూ కారణమే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా నుంచి కోలుకున్నా బాధితులకు ఉపశమనం కలగకుండా పోతోంది. కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులను పోస్టు కొవిడ్‌ సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. పోస్టు కొవిడ్‌ సమస్యల్లో ప్రదానంగా ఊపిరితిత్తులు, గుండె సంబందిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా విపత్కర కాలంలో రాష్ట్రంలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు సాధారణ పరిస్థితులతో పోల్చుకుంటే నాలుగింతలు పెరిగాయి. కరోనా వైరస్‌ ప్రధానంగా మనుషుల శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసింది. పలువురు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ పోస్టు కొవిడ్‌ అనారోగ్యం కారణంగా చాలా మంది ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు. కరోనా మొదటి వేవ్‌ మొదలు కొని, సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ను కలుపుకుని 2021-22 ఏడాదిలో 103 ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయంటే కరోనా వైరస్‌ ఏ స్థాయిలో శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసిందో అర్థం చేసుకోవచ్చు.

అదే కరోనా వ్యాప్తిలోకి రాక ముందు 2019-20లో రాష్ట్రంలో ఏడాది మొత్తం కేవలం 23 ఊపిరితిత్తుల ఆపరేషన్లే జరిగాయి. ఈ మేరకు జీవన్‌దాన్‌ ఫౌండేషన్‌ వివరాలను వెల్లడించింది. జీవన్‌దాన్‌ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం 2021లో 83 ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు జరగ్గా 2020లో 20 జరిగాయి. కరోనా నుంచి కోలుకున్నా పోస్ట్‌ కొవిడ్‌ అనారోగ్యం కారణంగానే ఇంత పెద్ద సంఖ్యలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయని జీవన్‌దాన్‌ ఇన్‌చార్జి డా. స్వర్ణల త చెబుతున్నారు. ఊపిరిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న బాధి తుల్లో ఎక్కువ మంది కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలోనే వైరస్‌ బారిన పడ్డారని వివరించారు. కరోనా నుంచి కోలుకున్నా జాగ్రత్తలు పాటించకపోతే ఊపిరితిత్తులు క్రమ క్రమంగా దెబ్బతింటున్నాయని హెచ్చరించారు. ఏద ఒకరోజులోనో, రెండు రోజుల్లోనో ఊపిరితిత్తుల డ్యామేజీ జరగలేదని చెబుతున్నారు. ఇంకా 20, నుంచి 30 మంది రోగులు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స కోసం వేయిటింగ్‌ లిస్టులో ఉన్నారు.

పోస్టు కొవిడ్‌ అనారోగ్య సమస్యల్లో భాగంగా ఇప్పటికీ చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అయితే ఊపిరితిత్తుల సమస్యలతో వచ్చిన రోగులకు నేరుగా ఊపిరితిత్తుల మార్పిడిని సూచించటం లేదని, వారి ఊపిరితిత్తులు క్రమంగా కోలుకునేలా వైద్య చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. కరోనా మొదటి వేవ్‌లో వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ చికిత్స పొందిన పేషెంట్ల ఊపిరితిత్తుల్లో మంట సమస్యలు తలెత్తుతున్నాయని, వారు బెడ్‌ రెస్టు తీసుకుంటే చాలంటున్నారు.
ఏళ్ల తరబడి అవయవాల కోసం ఎదురుచూపు

పదేళ్లలో 7689 అవయవమార్పిడి ఆపరేషన్లు
పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ లక్షల్లో రోగులు అవయవ మార్పిడికోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అవయవ మార్పిడితో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎదురు చూస్తున్న బాధితుల సంఖ్య లక్షల్లో ఉంటే అవయవదాతలు మాత్రం వందల్లో ఉంటున్నారు. తమ వాళ్ల ప్రాణాలు పోతున్నాయని తెలిసీ అదే సమయంలో బాధను దిగమింగుకు కుని మరికొందరి ప్రాణాలు నిలబెట్టేందుకు ముందుకురావడం చాలా సాహోసోపేతమైన అంశమని జీవన్‌దాన్‌ ఫౌండేషన్‌ చెబుతోంది. గడిచిన దశాబ్దంలో తెలంగాణలో 7689 అవయవ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. 2013 -2022 వరకు కాలేయ మార్పిడి 3664, కిడ్నీ 3587, గుండె 194, ఊపిరితిత్తులు 232 మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం 34 ఆసుపత్రులు,మరో 8 ఆసుపత్రులు జీవన్‌ దాన్‌ ఫౌండేషన్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాయి. 2022లో ఇప్పటి వరకు కిడ్నీలు 27, లివర్‌ 18, హార్ట్‌ 02 మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. గతేడాది కిడ్నీ 228, లివర్‌ 139,గుండె 26 మార్పిడి చికిత్సలు జరిగాయి. అవయవ దానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జీవన్‌దాన్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement