Wednesday, November 20, 2024

పెరిగిన ఇరానీ చాయ్ ధర.. కప్పు చాయ్​ ఎంతో తెలుసా?

హైద‌రాబాద్ సిటీలో ఇరానీ చాయ్ అంటే మస్త్​ ఫేమస్​.. రోజూ ఒక్క సారి అయినా సిప్​ చేయాలని అనుకోని వారుండరు. అయితే చాయ్​ ప్రియులకు ఇది కాస్త బాధకరమైన విషయమే. ఎందుకంటే హైదరాబాద్​లో ఇరానీ చాయ్​ రేట్లు పెంచేశారు హోటల్​ నిర్వాహకులు. ఒక క‌ప్పు చాయ్ మీద రూ. 5 పెంచిన‌ట్లు ప‌లు కేఫ్స్, హోట‌ళ్ల నిర్వాహ‌కులు తెలిపారు. ప్ర‌స్తుతం పెరిగిన ధ‌ర‌ల‌తో రూ. 15 ఉన్న ఇరానీ చాయ్ ధ‌ర రూ. 20కు చేరింది.. పాలు, టీ పౌడ‌ర్, చ‌క్కెర రేట్లు పెరిగిన కార‌ణంగానే ఇరానీ చాయ్ ధ‌ర‌లు పెంచిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. వీటితో పాటు క‌మ‌ర్షియ‌ల్ కూకింగ్ గ్యాస్ ధ‌ర‌లు కూడా పెరగ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తుంద‌న్నారు. డెయిరీ కంపెనీలు లీట‌ర్ పాల‌పై రూ.2 చొప్పున పెంచిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిస్థితుల మధ్య ఇరానీ చాయ్ ధ‌ర పెంచ‌క త‌ప్ప‌లేద‌ని కేఫ్స్ నిర్వాహ‌కులు వెల్ల‌డించారు.

అయితే.. పెరిగిన ధ‌ర‌లు చాయ్ బిజినెస్‌పై ప్ర‌భావం చూపుతాయని కొంత‌మంది టీ స్టాల్ నిర్వాహ‌కులు అంటున్నారు. చాయ్ ధ‌రలను పెంచ‌డంపై వినియోగ‌దారులు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. కాగా, లాక్‌డౌన్ కంటే ముందు ఒక క‌ప్పు ఇరానీ చాయ్ ధ‌ర రూ. 10గా ఉండేది. 2020లో లాక్‌డౌన్‌లో ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డంతో.. చాయ్ ధ‌ర‌ను రూ. 15కు పెంచారు. ఇప్పుడు పాలు, చ‌క్కెర‌, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయన్న కారణంగా మ‌రోసారి చాయ్ ధ‌ర‌ల‌ను పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement