ఎగువన కురుస్తున్న వర్షాలతోపాటు పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల డ్యామ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 43,610 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 33,936 క్యూసెక్కుల వరద వస్తున్నది. సోమవారం సాయంత్రం వరకు జలాశయానికి 1,04,961 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
ఇక.. శ్రీశైలం జలాశయంలోని కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 9,591 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కుల నీరు సాగర్‌కు రిలీజ్ అవుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.50 అడుగులున్నది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 196.11 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు.