తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పెరిగే రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ సవరణను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50శాతం, ఖాళీ స్థలాల విలువను 35శాతం, అపార్ట్‌మెంట్ ఫ్లాట్ విలువను 25నుంచి 30శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్‌ల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ విలువకు అలాగే సవరించిన విలువకు మధ్య వ్యత్యాసం 35 నుంచి 40 శాతం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వాణిజ్య సముదాయాల్లో కూడా అన్ని ఫ్లోర్‌లకు ఒకే మార్కెట్ విలువను అధికారులు నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగినట్లు తెలిపారు.
ఇక తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం, అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుకు 25 నుంచి 30 శాతం దాకా విలువను పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కూడా 50 శాతం పెరిగింది. సుదీర్ఘ సమీక్ష తర్వాత స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ప్రతిపాదనలను తాజాగా జిల్లా రిజిస్ట్రార్లకు పంపింది. అనంతరం రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రోజు, రేపు ప్రతిపాదనలను ఆమోదించి పంపించేలా చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.