ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ నిండుకుండను తలపిస్తోంది. అటు గోదావరి పరివాహక ప్రాంతం, ఇటు కృష్ణా నది పరివాహక ప్రాంతం మొత్తం ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది సాగు పనులకు కావల్సినంత నీరు అందుబాటులో ఉంటుందని, ఎట్లాంటి ఇబ్బందులు ఉండవని ఇరిగేషన్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– డిజిటల్ మీడియా విభాగం, ఆంధ్రప్రభ
ఉత్తర తెలంగాణలోని గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రధాన నీటి వనరులకు భారీగా ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు వానాకాలం సీజన్‌కు నీరు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి 81 గేట్ల ద్వారా 8.95 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీకి 8.95 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ఇక.. గోదావరి నదిలో 53 అడుగుల మేర ఉధృతంగా ప్రవాహం ఉండడంతో కొత్తగూడెం జిల్లా సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు భద్రచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిజామాబాద్‌లోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ), పోచారం, ఆదిలాబాద్‌లోని స్వర్ణ, కడెం ప్రాజెక్టులు, పెద్దపల్లిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నీటితో నిండిపోయాయి.
ఎస్‌ఆర్‌ఎస్పీ మొత్తం నిల్వ సామర్థ్యం 91 టీఎంసీలకు గానూ.. 67.75 టీఎంసీల నీటి నిల్వ ఉంది.. ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 1.36 లక్షల క్యూసెక్కులు ఉండగా తొమ్మిది గేట్లను తెరిచి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఇన్‌ఫ్లోలు 60,910 క్యూసెక్కులకు తగ్గడంతో మిడ్ మానేర్ డ్యామ్‌కు నీరు, విద్యుత్ ఉత్పత్తి కోసం 15 క్రెస్ట్ గేట్ల ద్వారా 41,670 క్యూసెక్కుల మేరకు విడుదల చేశారు. ఇక.. మహారాష్ట్రలోని బాబ్లీ, ఔరంగాబాద్, నాందేడ్‌లోని అప్‌స్ట్రీమ్ ప్రాంతాలు, ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న పరీవాహక ప్రాంతాల నుంచి మరిన్ని ఇన్‌ఫ్లోలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో డ్యామ్ నిండుతుందని చీఫ్ ఇంజనీర్ (ఇరిగేషన్) కె సుధాకర్‌రెడ్డి తెలిపారు.
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం పోచారం డ్యాం నుంచి కాలువకు నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు సోమవారం ఉదయం 6 గంటల వరకు గడచిన 24 గంటల్లో సగటున 60,351 ఇన్‌ఫ్లోలు రాగా, 59,783 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గడచిన 24 గంటల్లో సగటున 2.30 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, 2.53 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు.